దర్శకుడిగా జి.అశోక్ అందరికీ పరిచయమైంది “పిల్ల జమీందార్” సినిమాతోనే అయినప్పటికీ.. అంతకంటే ముందే “ఫ్లాష్ న్యూస్, ఆకాశరామన్న” అనే సినిమాల్ని తెరకెక్కించాడు. ఆ సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వకపోయినా “పిల్ల జమీందార్” మాత్రం సూపర్ హిట్ డైరెక్టర్ ని చేసింది. ఆ తర్వాత తెరకెక్కించిన “సుకుమారుడు, చిత్రాంగద” చిత్రాలు సరిగా వర్కవుట్ అవ్వలేదు.
అయితే.. 2018లో వచ్చిన “భాగమతి” మాత్రం అశోక్ ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మార్చింది. “భాగమతి” చిత్రాన్ని హిందీలో “దుర్గామతి”గా రీమేక్ చేశాడు అశోక్. ఆ సినిమా హిందీలో ఆశించిన స్థాయి సక్సెస్ ఇవ్వలేకపోయింది. కానీ.. అప్పటినుండి హిందీ ఇండస్ట్రీని పట్టుకుని వదలడం లేదు అశోక్. దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం “కుచ్ కట్టా హో జాయ్” అనే సినిమాని తెరకెక్కించాడు. అది కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవ్వలేదు.
మళ్లీ 2025లో సోహమ్ షా, నోరా ఫతేహి, నుస్రత్ బరుచాలు ప్రధాన పాత్రల్లో “ఉఫ్ ఏహ్ సియాపా” అనే హిందీ సినిమా తెరకెక్కించాడు. “పుష్పక విమానం” తరహాలో అస్సలు మాటలు లేకుండా కేవలం సంగీతంతో సినిమాని తెరకెక్కించాడు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కనీస స్థాయి ప్రేక్షకాదరణ లభించలేదు. బాలీవుడ్ ని పట్టుకుని వేలాడుతున్న అశోక్ కి పోనీ టాలీవుడ్ లో ఆఫర్లు లేవా అంటే కాదు.
హవీష్ హీరోగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఒక సినిమా షూట్ చేసి, ఆ సినిమాని కంప్లీట్ చేయకుండా ముంబైలో కూర్చున్నాడు అశోక్. మరి ఈ బాలీవుడ్ మిధ్యలో నుంచి అశోక్ ఎప్పడు బయటపడి, తనకు అచ్చొచ్చిన తెలుగు సినిమాలు తీయడం ఎప్పుడు మొదలెడతాడో చూడాలి. అశోక్ వద్ద కొందరు తెలుగు సినిమా నిర్మాతల అడ్వాన్సులు కూడా ఉన్నాయని సమాచారం. మరి అశోక్ ఆ అడ్వాన్సులకు ఎప్పడు న్యాయం చేస్తాడో మరి.