హిట్స్, ప్లాప్స్ అనేవి యే ఫిల్మ్ మేకర్ కి అయినా కామన్. కాకపోతే దర్శకులు ఫ్లాప్ భారాన్ని కాస్త ఎక్కువగా మోయాల్సి వస్తుంది. నెక్స్ట్ హిట్టు కొట్టేవరకు ఆ డైరెక్టర్ కి ఓ అగ్ని పరీక్షలానే ఉంటుంది.
దర్శకుడు హరీష్ శంకర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు.అతని గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్'(Mr. Bachchan) దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్లాప్ అనే పదం కూడా చిన్నదేమో అనేంతలా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అసలు ఈ సినిమా ఎందుకు అలా తేడా కొట్టేసింది? తాజాగా దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ కూడా వివరణ ఇచ్చుకున్నారు.
ఇందుకు తన రైటింగ్ కూడా వీక్ గా ఉండటం కారణమని అంగీకరించాడు హరీష్. అతను ఇంకా మాట్లాడుతూ..”ఓటీటీ డీల్ వల్లే ఈ సినిమాకు దెబ్బ పడింది. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆగస్టు 14న రిలీజ్ చేయాలని సడెన్‌గా డేట్ ఫిక్స్ చేశారు. మేం ఆగస్టు 4 వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాం. ఈ హడావుడి వల్ల సెకండాఫ్ సరిగ్గా చూసుకోలేకపోయాం. అయితే సినిమా పోవడానికి ఇది మాత్రమే కారణం అని నేను చెప్పను. ఎందుకంటే.. సెకండాఫ్‌లో నా రైటింగ్ చాలా వీక్ గా ఉంది.
ఒకవేళ 2 ఏళ్ళు టైమ్ తీసుకుని తీసినా రిజల్ట్ అలాగే ఉండేదేమో. కానీ కాస్త టైమ్ దొరికి ఉంటే ఔట్‌పుట్ ఇంకొంచెం బెటర్‌గా ఉండేది అనిపిస్తుంటుంది” అంటూ హరీష్ చెప్పుకొచ్చారు.అలాగే ‘ఈ సినిమాలో హిందీ పాటలు పెట్టడం కూడా పెద్ద మైనస్ అయిందని, వేరే హీరో అయితే ఆ హిందీ పాటలకు అస్సలు ఒప్పుకునేవారు కాదు. కానీ నేనూ, రవితేజ ఇద్దరం కిషోర్ కుమార్, మహ్మద్ రఫీకి పెద్ద ఫ్యాన్స్.
నేను ఓ పాట చెప్పగానే.. ఆయన సూపర్ అనేశారు. అలా ఫ్లోలో పెట్టిన ఆ హిందీ పాటలు సినిమాను బాగా డ్యామేజ్ చేశాయి’ అని హరీష్ విశ్లేషించుకున్నారు.నిజానికి ఈ సినిమా కంటే ముందే రవితేజకు వరుసగా మూడు ప్లాపులు పడ్డాయి. సో, ఈ రిజల్ట్ ఆయనకు పెద్ద కొత్తేం కాదు. కాకపోతే హరీష్ శంకర్ చేతిలో పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరో ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ ఎఫెక్ట్ హరీష్ ఎక్కువగా మోయాల్సి వస్తోంది.