Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా (59) ప్రమాదవశాత్తు కన్నుమూశారు. గ్యాంగ్‌స్టర్‌ సినిమాలు, యాక్షన్‌ థ్రిల్లర్లు, క్రైమ్‌ జానర్‌ సినిమాలతో బాలీవుడ్‌లో తనదైన మార్క్‌ వేశారు సంజయ్‌. తన ఇంట్లో శుక్రవారం ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. ఈ క్రమంలో తలకు బలమైన గాయం కావడంతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు వెల్లడించారు. సంజయ్‌కు భార్య అనురాధ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Sanjay Gupta

1969లో ముంబయిలో జన్మించిన సంజయ్‌ గుప్తా.. బాలీవుడ్‌లో దర్శకుడు, నిర్మాత, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంజయ్‌ దత్, రవీనా టాండన్‌ కాంబోలో వచ్చిన ‘ఆతిశ్‌: ఫీల్‌ ది ఫైర్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు సంజయ్‌. ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్, సంజయ్‌ దత్‌ కాంబోలో వచ్చిన ‘కాంటే’ సినిమాతో బ్లాక్‌బస్టర్ డైరక్టర్ అయిపోయారు. ఆ తర్వాత ‘ముసాఫిర్‌’, ‘జిందా’, ‘దస్‌ కహానియా’, ‘జజ్బా’, ‘కాబిల్‌’, ‘ముంబై సాగా’ సినిమాలు చేశారు.

అలాగే ‘షూటౌట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా’, ‘దస్‌ కహానియా’ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు. ఆయన చివరిగా ‘ది మిరాండా బ్రదర్స్‌’ అనే సినిమాను రెండేళ్ల క్రితం తెరకెక్కించారు. ఇక సంజయ్‌ గుప్తా వ్యక్తిగత జీవితంలోని ప్రేమకథలో ఆసక్తికర మలుపులు ఉన్నాయి. ఆయన భార్య అనురాధతో విడాకులు తీసుకున్నప్పటికీ ఆ బంధం నుంచి పూర్తిగా బయటపడలేకపోయారు. దాంతో ఆమెనే మరోసారి వివాహం చేసుకున్నారు. దీని వెనుక అండర్‌ వరల్డ్‌ టచ్‌ కూడా ఉంది.

అనురాధ లేఖి గుప్తాతో రెండున్నరేళ్ల డేటింగ్‌ తర్వాత 1997లో వివాహం చేసుకున్నారు సంజయ్‌. 2003లో వారు విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ, సంజయ్‌ ఆమెను మర్చిపోలేకపోయారు. తిరిగి ఆమెను 2009లో ఆమెను మళ్లీ వివాహం చేసుకున్నారు. అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సంబంధమున్న వ్యక్తులకు, సంజయ్‌కి మధ్య ఓ విషయంలో అపార్థాలు వచ్చాయట. వాటిని పరిష్కరించుకొనేందుకు కొన్నాళ్ల పాటు ఆయన ఒంటరిగా ఫోన్‌లో మాట్లాడేవారట. దాని కోసం ఓ స్నేహితుడు ఫ్లాట్‌లో ఉన్నారట.

అయితే, భార్య భద్రత దృష్ట్యా ఆ విషయాలేవీ చెప్పలేదట. ఆయన రోజూ ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది చెప్పలేని స్థితిలో ఉండేవారట. దీంతో సంజయ్‌కి ఎవరితోనో ఎఫైర్‌ ఉన్నట్లు అనురాధ అనుమానించరట. దానికి తోడు అప్పుడు ఆయన కెరీర్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉందట. ఆర్థిక సమస్యలు కూడా ఉండేవట. దీంతో విభేదాలు పెరిగి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు విషయాలు అర్థమై మళ్లీ కలుసుకున్నారట.

‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus