డైరక్టర్ శంకర్ ప్రస్తుతం “రోబో 2 . ఓ” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరో, విలన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. అందుకే “రోబో 2 . ఓ” తెలుగు థియేటర్ హక్కులను ఏషియన్ సునీల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 80 కోట్లతో ఈ హక్కులను దక్కించుకున్నారు. అందుకు తగినట్లుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సునీల్ భావిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక జరపాలని అనుకుంటున్నారు. నవంబర్ లో నిర్వహించే ఈ ఈవెంట్ కి రజినీకాంత్ తో పాటు దర్శకుడు శంకర్, రెహ్మాన్ లు కూడా హాజరుకానున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మహేష్ బాబు వస్తే మరింత బాగుటుందని ఏషియన్ సునీల్ డైరక్టర్ శంకర్ తో చెప్పగా అందుకు ఆయన సరేనన్నట్లు తెలిసింది. ఇక మహేష్ ని ఆహ్వానించే బాధ్యతను శంకర్ తీసుకున్నారు. స్వయంగా మహేష్ ని కలిసి వేడుకకు రావాలని శంకర్ పిలవనున్నారు. మరి స్టార్ డైరక్టర్ ఆహ్వానాన్ని మహేష్ మన్నిస్తారో ? లేదో చూడాలి.