టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు వెంకీ కుడుముల. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి వరుస సూపర్ హిట్స్ తో అనతికాలంలోనే క్రేజీ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆ విజయాల తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉండగా, కొన్ని ఊహించని కారణాల వల్ల ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆగిపోయింది.
అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తన లక్కీ హీరో నితిన్ తో ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ లో ‘రాబిన్ హుడ్’ అనే సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఊహించని డిజాస్టర్ తర్వాత వెంకీ కుడుముల మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ సైలెంట్ అయిపోయాడు. అయితే తాజాగా ఆయన ‘ఇట్లు అర్జున’ అనే సినిమాతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు.
నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకీ కుడుములకు మీడియా ప్రతినిధుల నుంచి, ప్రశ్నోత్తరాల (క్యూ అండ్ ఎ) సమయంలో ‘రాబిన్ హుడ్’ ఫలితంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో హుందాగా బదులిస్తూ.. “మనం ఆడే ప్రతీ మ్యాచ్ గెలవలేం కదా. ఆ సినిమా కోసం మా వంద శాతం ఎఫర్ట్ పెట్టాము.
మొదటి రెండు సినిమాలు నా కంఫర్ట్ జోన్ లో ఉండి పూర్తి వినోదాత్మకంగా చేశాను. కానీ 3వ సినిమాకు కొంచెం భిన్నంగా ఆలోచించి డ్రగ్స్, మాఫియా నేపథ్యాన్ని ఎంచుకుని కొత్త అడుగు వేశాను. దురదృష్టవశాత్తు ఆ ఫలితం మేము ఆశించినట్లుగా రాలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ నా బలాన్ని నమ్ముకుని పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ కథపై వర్క్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమా ఫలితాన్ని బాగానే అనలైజ్ చేసుకున్నాడు వెంకీ. అతని మాటలను బట్టి త్వరలోనే ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పకనే చెప్పాడు.