పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సర్దార్ గబ్బర్ సింగ్ బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. సర్దార్ కి కాటమరాయుడి కి మధ్య ఈ లింకేమిటి అని క్వశ్చిన్ మార్క్ ఫేస్ పెట్టకండి. ఈ రెండికి మధ్య మంచి సంబంధం ఉంది. గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ వస్తున్న సినిమా కావడంతో సర్ధార్ గబ్బర్ సింగ్ ని అత్యధిక రేట్ కి పోటీపడి కొనుగోలు చేశారు. ఆ చిత్రం ఫెయిల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఘోరంగా నష్టపోయారు. మాకు న్యాయం చేయమని బాధిత పంపిణీదారులు గగ్గోలు పెట్టగా, పవన్ కళ్యాణ్ స్పందించి.. నష్టపోయిన వారిని తన నెక్స్ట్ సినిమా ఇస్తామని మాట ఇచ్చారు. డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు పూర్తికావచ్చింది. ఈనెల థియేటర్ లోకి రావడానికి ముస్తాబవుతోంది.
ఈ సమయంలో సర్దార్ బాధిత డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత శరత్ మారార్ , పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లను కలవగా వారు కొంతమందికి మరికొంతమందికి ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు కాటమరాయుడు హక్కులు ఇవ్వడం లేదని, సర్దార్ వల్ల అయిన 2 కోట్ల అప్పులను ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ దిలీప్ తాండన్, తరుణ్ లు తమకి సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల 8 కోట్ల నష్టం జరిగిందని వాపోయారు. నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ సమయంలో సినిమా బాధితుల వల్ల పవన్ కి చిక్కులు వస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.