‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్ లో చాలా సినిమాలే చేశారు. కానీ ఏదీ సరైన హిట్టుని ఇవ్వలేకపోయింది. లాక్ డౌన్ లో అతడు నటించిన ఒకట్రెండు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. యూత్ ని టార్గెట్ గా చేసుకొని చిత్రీకరించిన ఈ సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఇక రీసెంట్ గా ‘డీజే టిల్లు’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ యంగ్ హీరో.
చాలాకాలంగా ఎదురుచూస్తోన్న సక్సెస్ ‘డీజే టిల్లు’ సినిమాతో అందుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో దీనికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. దీనికోసం సిద్ధు జొన్నలగడ్డ తనకొచ్చిన రెండు సినిమా ఆఫర్స్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ హీరో ఓ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ‘డీజే టిల్లు’ హిట్ కావడంతో విలన్ రోల్ ని పక్కన పెట్టేశారు. అలానే మరో సినిమా నుంచి కూడా తప్పుకున్నారు.
ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ‘డీజే టిల్లు’ పార్ట్ 2పైనే ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు, ఆయన టీమ్ కలిసి స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యారు. దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
మొదటి పార్ట్ ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ సీక్వెల్ ను కూడా హ్యాండిల్ చేయబోతున్నారు. అయితే ‘డీజే టిల్లు’లో ఫేమస్ అయిన రాధికా క్యారెక్టర్ పార్ట్ 2లో ఉండదని అంటున్నారు. ఈసారి కొత్త హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. సీక్వెల్ తో కూడా హిట్ అందుకుంటారేమో చూడాలి!