Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా రివ్యూ & రేటింగ్!
- October 2, 2026 / 08:00 AM ISTByFilmy Focus Desk
Cast & Crew
- ఫహాద్ ఫాజిల్ (Hero)
- NA (Heroine)
- సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్, సుబ్బరాజు, మహేష్ మంజ్రేకర్, వెంకటేష్ కాకుమాను తదితరులు (Cast)
- శశాంక్ యేలేటి (Director)
- ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని (Producer)
- కాలభైరవ (Music)
- బ్రాడ్ ఫ్రాన్సిస్ (Cinematography)
- ప్రవీణ్ ఆంటోనీ (Editor)
- Release Date : 2nd అక్టోబర్ 2026
- అర్కా మీడియా, షోయింగ్ బిజినెస్ (Banner)
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don’t Trouble The Trouble) మూవీ ప్రమోషన్స్‌తోనే తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రజెంటర్ కావడం, బాహుబలి నిర్మాతలతో కలిసి రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను నిర్మించడంతో ఇందులో ఏదో కొత్తదనం ఉందని తెలుగు ఆడియెన్స్ భావించారు. మరోవైపు ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్, సూర్య వంటి స్టార్లు భాగం కావడంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. పుష్ప, పుష్ప 2 సినిమాల తర్వాత ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) తెలుగులో చేసిన ఈ స్ట్రెయిట్ మూవీకి శశాంక్ యేలేటి దర్వకత్వం వహించాడు. సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఎలా ఉంది? ఈ హారర్ కామెడీ మూవీతో ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే?
Don’t Trouble The Trouble Movie Review

కథ: సూరి (Fahadh Faasil) ఓ అనాథ. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. జీవితంలో డబ్బే ముఖ్యమని నమ్ముతుంటాడు. ఆ డబ్బు కోసమే అస్లాం (మహేష్ మంజ్రేకర్) అనే రౌడీని మోసం చేయబోయి దొరికిపోతాడు. రెండు రోజుల్లో పాతిక లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని సూరికి అస్లాం వార్నింగ్ ఇస్తాడు. అస్లాంకు ఇస్తానన్న డబ్బు కోసం దివ్య (సారా పాలేకర్) అనే చిన్నారిని కిడ్నాప్ చేస్తాడు సూరి. ఆ పాపను అడ్డుపెట్టుకొని ఆమె మావయ్య ప్రతాప్‌ను (సౌరభ్ సచ్‌దేవ్) బ్లాక్‌బెయిల్ చేయాలని చూస్తాడు. ఈ క్రమంలోనే దివ్య మనిషి కాదని, ఆత్మ అనే నిజం సూరికి తెలుస్తుంది. కేవలం దివ్య తనకు మాత్రమే కనిపిస్తుందని అర్థం చేసుకుంటాడు. కనిపించకుండాపోయిన తన తల్లిదండ్రులను వెతికిపెట్టమని సూరిని కోరుతుంది దివ్య. ఆ చిన్నారి ఎలా ఆత్మగా మారింది? దివ్య తల్లిదండ్రులు ఏమయ్యారు? అస్లాం బారి నుంచి సూరి ఎలా తప్పించుకున్నాడు? దివ్యను కిడ్నాప్ చేశాడని సూరిని అనుమానించిన ప్రతాప్‌కు అసలు నిజం తెలిసిందా? దివ్యకు ఇచ్చిన మాటను సూరి నిలబెట్టుకున్నాడా? అన్నదే మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: డబ్బు పిచ్చి కలిగిన అంబులెన్స్ డ్రైవర్‌గా నెగెటివ్‌గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్‌లో నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచాడు ఫహాద్ ఫాజిల్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీకి వన్ మెన్ షోగా నిలిచాడు. రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ఈ సినిమాలో దాదాపు ప్రతి సీన్‌లో ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడు. అతడి కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. చిన్నారి ఆత్మగా సారా పాలేకర్ నటన బాగుంది. ఫహాద్ ఫాజిల్‌తో (Fahadh Faasil) సమానంగా ఆమె స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. సౌరభ్ సచ్‌దేవ్ టాలెంట్‌ను పూర్తిగా వాడుకోలేదు. సుబ్బరాజు రొటీన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఫహాద్ స్నేహితుడిగా వెంకటేష్ కాకుమాను నటన ఒకే. విలన్‌గా మహేష్ మంజ్రేకర్ పాత్ర అటు సీరియస్‌గా…ఇటు కామెడీగా కాకుండా మధ్యస్థంగా మిగిలిపోయింది. శశాంక్, దివ్యపిళ్లై గెస్ట్ రోల్స్ చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు: గ్లామరస్‌గా కనిపించే ఓ హీరోయిన్… పాటలు, రొమాంటిక్ ట్రాక్ లేకుండా కూడా కమర్షియల్ సినిమా చేయచ్చుననే డైరెక్టర్ శశాంక్ యేలేటి ఆలోచన బాగుంది. కానీ ఆచరణలోనే తడబడిపోయారు. రొటీన్ కథను ఎంచుకోవడంలోనే దర్శకుడు సగం ఫెయిలయ్యాడు. తెలిసిన కథనే కొత్తగా చెప్పేందుకు ఎక్కడ ప్రయత్నించలేదు. ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు సినిమా బోర్ కొట్టిస్తుంది. .
కాలభైరవ పాటల్లో వినాలపించేవి లేవు. బీజీఎమ్ కూడా మోస్తారుగానే ఉంది. బ్రాడ్ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైవ్ లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేయడంతో రియలిస్టిక్ ఫీల్ కలిగింది. బాహుబలి నిర్మాతలతో పాటు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించారు. లిమిటెడ్ బడ్జెట్‌లోనే క్వాలిటీతో సినిమాను రూపొందించారు.

విశ్లేషణ: హీరోకు మాత్రమే ఆత్మ కనిపించడం… ఆ ఆత్మను చూసి తొలుత భయపడిన కథానాయకుడు…ఆ తర్వాత దానికి సాయం చేయడం అనే కాన్సెప్ట్‌తో తెలుగులో చాలానే సినిమాలొచ్చాయి. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కథ కూడా ఇదే. డబ్బే ముఖ్యమని అనుకున్న ఓ యువకుడు మానవ సంబంధాల విలువను ఎలా తెలుసుకున్నాడు? ఓ ఆత్మకు ఏ విధంగా సాయం చేశాడనే అంశాలతో శశాంక్ యేలేటి ఈ కథను రాసుకున్నారు. కానీ ఈ కథలో ఎమోషన్స్, కామెడీ , సెంటిమెంట్ ఏది వర్కవుట్ కాకపోవడంతో సోల్‌లెస్ మూవీగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ నిలిచింది.
సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్సయ్యాయి. సూరితో ఆ చిన్నారి సాగించే జర్నీలో ఆసక్తి లోపించింది. అసలు దివ్య తల్లిదండ్రులు ఏమయ్యారో తెలుసుకోకుండా సూరి చివరి వరకు టైమ్‌పాస్ చేయడం ఆకట్టుకోదు. పోలీసుల ఇన్వేస్టిగేషన్ సీన్లు సినిమా నిడివి పెంచడానికి తప్ప ఎందుకు ఉపయోగపడలేదు. కిడ్నాప్ డ్రామాను థ్రిల్లింగ్‌గా రాసుకోలేదు. దివ్య మనిషి కాదు…ఆత్మ అని తెలిసిన తర్వాత సూరి పడే భయపడే సీన్లు నవ్వించలేకపోయాయి. ఆత్మ సాయంతో విలన్లపై సూరి రివేంజ్ తీర్చుకునే ఎపిసోడ్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా రాసుకుంటే బాగుండేది…ఇలా సినిమాలో చాలానే లోపాలు ఉన్నాయి.
రెగ్యులర్ తెలుగు సినిమాలా కాకుండా డిఫరెంట్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు. ఆ సీన్ మాత్రం కొత్తగా ఉంది. ఫహాద్ ఫాజిల్ కొన్ని సీన్లలో జీవించాడు. నెగెటివ్ షేడ్స్‌తో మొదలై అతడి పాత్రలో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. కానీ అతడి డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు.

ఫోకస్ పాయింట్: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టైటిల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో లేదు. ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.
రేటింగ్ : 2/5













