దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, కీర్తి సురేష్ (Keerthy Suresh) కాంబినేషన్‌లో ‘డోరోతీ’ అనే సినిమా వచ్చింది. గత వారం తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. అయినప్పటికీ దీనిని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రానా తన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్‌పై ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా? తెలుసుకుందాం రండి..
కథ: సుబ్బు (సనంత్), కార్తీ (రిషికాంత్) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచీ కార్తీ… సుబ్బు వాళ్ల ఇంట్లోనే పెరుగుతాడు. కానీ, సుబ్బు తండ్రి విజిల్ వీరయ్యకు కులపిచ్చి ఎక్కువ. కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాల కంటే పరువు ప్రతిష్టలు, కులం వంటి వాటికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. ఇంట్లో ఆడవాళ్లను సైతం అణగదొక్కి అదుపులో పెట్టుకోవాలనుకునే మూర్ఖుడు ఈ విజిల్ వీరయ్య.అయితే, అతని రెండో కొడుకు డోరోతి (Keerthy Suresh) అనే మలయాళీ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఆమెతో మూడో కొడుకైన సుబ్బు ఎక్కువ సన్నిహితంగా ఉండటాన్ని చూసి వీరయ్య తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు ఆమె ఉరేసుకుని చనిపోతుంది. దీంతో సుబ్బు తన తండ్రి వీరయ్యపై తీవ్ర కోపం పెంచుకుని, అతనికి ఇష్టం లేని ఓ పని చేస్తాడు.
ఆ పని ఏంటి? దానివల్ల సుబ్బు, కార్తీల జీవితాలు ఏమయ్యాయి? సుబ్బుని చంపడానికి వీరయ్య, కార్తీని ఎందుకు ఆశ్రయించాడు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపించేది కాసేపే అయినా.. టైటిల్ రోల్ ప్లే చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కీర్తి లుక్స్ కూడా ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక సనంత్.. సుబ్బు అనే 3 రకాల షేడ్స్ కలిగిన పాత్రలో చాలా బాగా చేశాడు. సెకండాఫ్‌లో ఇతని పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇక కార్తీ పాత్రలో రిషికాంత్ కూడా అదరగొట్టాడు. ఆ తర్వాత విజిల్ వీరయ్య పాత్ర సినిమాకి చాలా కీలకం. ముత్తుకుమార్ ఈ పాత్రకి జీవం పోశాడు. డైలాగులు పెద్దగా లేకపోయినా విజిల్‌తోనే అందరినీ వణికించే పాత్ర ఇది.
సాంకేతిక వర్గం పనితీరు: కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో ఒక బలమైన ఎమోషన్ ఉంటుంది. అలాగే టెక్నికల్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇతని స్ట్రెంత్ గురించి మాట్లాడాలంటే.. ఫస్ట్ హాఫ్ ను చాలా బాగా నడిపిస్తాడు. ఇంటర్వెల్ కి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పెడతాడు. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ సన్నగిల్లిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ లో ప్రాపర్ కన్‌క్లూజన్ అంటూ ఉండదు.
ఈ డోరతీ విషయంలో కూడా అదే చేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా మలిచాడు. ఇంటర్వెల్ ఫైట్ కి సినిమా రేంజ్ పెరుగుతుంది. అప్పుడు సెకండాఫ్ ఎలా ఉంటుందో అని ఆడియన్స్ చాలా ఊహించుకొని ఆసక్తిగా సీట్లో కూర్చుంటారు. కానీ కాసేపటికే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కథంతా ఎటెటో వెళ్తుంది. ఆడియన్స్ కు ఓపిక నశిస్తుంది. క్లైమాక్స్ కూడా ప్రాపర్ గా ఉండదు. చాలా ప్రశ్నలతోనే సినిమా ముగుస్తుంది.
అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు.. టెక్నికల్ గా సినిమా బాగుంటుంది. 1990ల వాతావరణాన్ని చాలా పర్ఫెక్ట్ గా ఆవిష్కరించాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ హ్యాంగ్ చేసుకునే విజువల్ చాలా రియలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కూడా కథాకథనాలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే సెకండాఫ్ లో చాలా పోర్షన్ ట్రిమ్ చేయొచ్చు. సినిమా రిజల్ట్ అందరికీ తెలిసినప్పుడు.. కనీసం తెలుగు వెర్షన్ కి అయినా ఆ పని చేయాల్సింది. కానీ మేకర్స్ అలాంటి స్టెప్ తీసుకోలేదు. దానివల్ల రన్ టైమ్ కూడా ఆడియన్స్ ను ఇబ్బంది పెడుతుంది.
విశ్లేషణ: నపుంసకుల జీవితాల ఆధారంగా ‘కాంచన’ వచ్చింది, మంచి విజయాన్ని అందుకుంది. మన తెలుగులో ‘స్వాగ్’ అనే సినిమా వచ్చింది. థియేటర్లలో అది పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ‘డోరతీ’తో కార్తీక్ సుబ్బరాజ్ కూడా తన టేక్ ఏంటనేది చూపించాడు. రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా అతను పూర్తిస్థాయి ఎఫర్ట్ పెట్టకుండా చేసిన ప్రయత్నమిది. అందువల్ల ఆడియన్స్ ను ఓ కన్ఫ్యూజన్ లో వదిలేసిన సినిమాగా మిగిలిపోతుంది.
ఫోకస్ పాయింట్: బయటకు పారిపోవడానికి డోర్ తీ(య్)
రేటింగ్: 2/5