ఒక భాషలో హిట్ అయిన సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేయడం కామన్. రీమేక్ సినిమా అంటే కొంచెం మార్పులు చేసి.. నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఓటీటీ హవా పెరిగిన తరువాత అన్ని భాషల సినిమాలను అందరూ చూసేస్తున్నారు. దీంతో రీమేక్ అనగానే జనాల్లో ఆసక్తి కోల్పోతుంది. అందుకే వాటికి సరైన ఫలితాలు రావడం లేదు. అయినప్పటికీ.. రీమేక్ ల పట్ల దర్శకనిర్మాతల మోజు తగ్గట్లేదు.
తాజాగా బాలీవుడ్ కి ఒక రీమేక్ షాకిచ్చింది. అదే ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ ఆయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పలు భాషల్లో రీమేక్ గురించి వార్తలొచ్చాయి. తెలుగులో రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తారని అన్నారు. చరణ్ తన బ్యానర్ కోసం ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తీసుకున్నారని సమాచారం. చరణ్ కాకపోతే.. రవితేజ నటించే ఛాన్స్ ఉందన్నారు.
కానీ తెలుగులో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతలో హిందీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో ‘సెల్ఫీ’ అనే పేరుతో రీమేక్ తీశారు. ప్రమోషన్స్ సమయంలో చిత్రబృందం చాలా హడావిడి చేసింది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా అనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ తీరా చూస్తే.. ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఘోర పరాయజం తప్పలేదు. తొలిరోజు కేవలం రెండు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది ఈ సినిమా.
అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాకి ఇలాంటి ఓపెనింగ్స్ రావడం షాకింగ్ గా ఉంది. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు తెలుగు రీమేక్ ఉంటుందనే అనుకున్నారు. కానీ హిందీలో ఇలాంటి రెస్పాన్స్ వచ్చిన తరువాత తెలుగు రీమేక్ తీసే ధైర్యం చేయరనిపిస్తుంది.