దుల్కర్ సల్మాన్‌ను (Dulquer Salmaan) తొలినాళ్లలో ‘ఓకే బంగారం’ (OK Bangaram) సినిమాలో చూసి ‘మన దగ్గర వరుస సినిమాలు చేస్తే బాగుండు’ అని అనుకోని సినిమా ప్రేక్షకుడు ఉండడు. గుడ్ లుకింగ్, నైస్ యాక్టింగ్‌తో భలేగా ఉంటాడు ఈ మమ్ముట్టి (Mammootty) వారసుడు. అలా అనుకున్నవాళ్ల కోరిక నెరవేరేలా దుల్కర్ అడపాదడపా ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకాస్త జోష్ ఇచ్చేలా మరో సినిమాను ఓకే చేశాడు అని టాక్. త్వరలో ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అంటున్నారు.
దుల్కర్ సల్మాన్ మలయాళంలో ఎంత బిజీగా ఉన్నా.. తెలుగులోనూ సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు అని అర్థమవుతోంది. ‘మహానటి’ (Mahanati) సినిమాతో తెలుగులో మరపురాని పాత్రను చేసిన దుల్కర్.. ఆ తర్వాత ‘సీతారామం’ (Sita Ramam) సినిమాతో మరింత దగ్గరైపోయాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ లోపే మరో తెలుగు సినిమా ఓకే చేశాడు అంటున్నారు.
దుల్కర్ ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలు రెండూ వైజయంతి మూవీస్వే. ఆ బ్యానర్ మీదే తెలుగులో లాంచ్ అయ్యాడు. రీసెంట్ ఆ బ్యానర్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’లో (Kalki 2898 AD) అతిథి పాత్రలో కనిపించాడు కూడా. ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా అందులోనే అంటున్నారు. పవన్ సాధినేని దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ లాకైనట్టు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు తుదిదశకు వచ్చాయి అని చెబుతున్నారు.
ఈ బ్యానర్ కాకుండా దుల్కర్ చేసిన సినిమా ‘లక్కీ భాస్కర్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకీ అట్లూరి (Venky Attluri) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ మధ్య టీజర్ వచ్చినప్పుడు భారీ స్పందనే వచ్చింది. ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా కచ్చితంగా దుల్కర్‌కు మంచి పేరు తెచ్చిపెడుతుందని టీమ్ చెబుతోంది. మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఏదేమైనా దుల్కర్ వరుస సినిమాలు చేస్తుండటం ఆసక్తికరమే.