ఎక్కడికి పోతావు చిన్నవాడా

“స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సెస్ సూర్య” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న నిఖిల్ హిట్ల పరంపరకు ఆ తర్వాత వచ్చిన “శంకరాభరణం” స్పీడ్ బ్రేకర్ లా మారింది. ఆ దెబ్బ నుండి తేరుకోవడానికి నిఖిల్ కు కాస్త సమయం పట్టినప్పటికీ.. “టైగర్” ఫేమ్ వి.ఐ.ఆనంద్ చెప్పిన కథ నచ్చడంతో “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి నిఖిల్ ఈ చిత్రంతో ఎలాంటి అనుభవం ఎదుర్కోనున్నాడో తెలియాలంటే మా సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ : కనీసం ముఖం కూడా చూడకుండానే కేవలం మనసు నచ్చి ఆయేషాతో పెళ్ళికి సిద్ధమైపోయిన యువకుడు అర్జున్ (నిఖిల్), కానీ రిజిష్టర్ ఆఫీస్ కి వస్తానన్న అమ్మాయి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొని కూర్చోవడంతో మొదటి ప్రేమలో విఫలమైన బాధతో జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. ఆ తరుణంలో తన స్నేహితుడి అన్నయ్య (వెన్నెల కిషోర్) ట్రీట్ మెంట్ కోసం కేరళ వెళ్ళిన అర్జున్ కి పరిచయమవుతుంది అమల అలియాస్ నిత్య (హెబ్బా పటేల్). ప్రేమతీరం చేరుకొనేలోపు ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది. కట్ చేస్తే.. నేనే అమల అంటూ తమిళనాడు నుంచి పార్వతి (నందిత శ్వేత) హైద్రాబాద్ చేరుకొంటుంది. అసలు అమల ఎవరు, అర్జున్ ప్రేమించిన ఆయేషా ఏమయ్యింది, అసలు అర్జున్ తో ఏమాత్రం సంబంధం లేని నిత్య, పార్వతీలు అతడి వెంట ప్రేమ అని ఎందుకు తిరుగుతుంటారు? వంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కు సమాధానంగా విఐ.ఆనంద్ తెరకెక్కించిన చిత్రమే “ఎక్కడికి పోతావు చిన్నవాడా”.

నటీనటుల పనితీరు : ఎప్పట్లానే నిఖిల్ అర్జున్ పాత్రను ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఎమోషన్స్ పరంగా తేలిపోయినా ఓవరాల్ గా మంచి మార్కులే సంపాదించుకొన్నాడు. హెబ్బా పటేల్ అందాల ప్రదర్శనతో అలరించింది, నందిత శ్వేత “అమల అలియాస్ పార్వతి” పాత్రకి ప్రాణం పోసింది. మాటలతో చెప్పలేని చాలా భావాలని కళ్ళతోనే పలికించింది. పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో నటిగా తన సత్తాను చాటడంతోపాటు సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది ఆవికా గోర్. తింగరోడిగా వెన్నెల కిషోర్ ఫస్టాఫ్ లో కడుపుబ్బ నవ్వించగా.. సెకండాఫ్ లో సత్య, సుదర్శన్ లు ఆ కామెడీని కంటిన్యూ చేసి ఆకట్టుకొన్నారు. తనికెళ్ళభరణి, రాజారవీంద్రలు పాత్రల పరిధిమేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : శేఖర్ చంద్ర సమకూర్చిన బాణీలు సరికొత్తగా ఉన్నాయి, వాటిని చిత్రీకరించిన విధానమూ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా కొత్తదనం ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెట్రో మ్యూజిక్ సినిమాపై అంచనాల్ని తారుమారు చేసింది. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి పాజిటివ్ నెస్ ను యాడ్ చేసింది. కేరళ ఎపిసోడ్స్, క్లైమాక్స్ లో టాప్ యాంగిల్ బ్లాక్స్ బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే నైట్ ఎఫెక్ట్ షాట్స్ లో లైటింగ్ తేలిపోయింది. అలాగే గింబిల్ తో చేసిన పాసింగ్ షాట్స్ మరీ స్లోగా అనిపిస్తాయి.

ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్ లో కన్ఫ్యూజన్ లేకుండా బ్లాక్స్ ను కట్ చేసిన విధానం సినిమాకి మెయిన్ ఎస్సెట్. అయితే.. ఆ నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరో మార్కెట్ స్థాయిని మించి ఖర్చు చేశారనిపించినా.. ఆడియన్ కి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. దర్శకుడిగా తన తొలి చిత్రమైన “అప్పుచ్చి గ్రామమ్” మొదలుకొని ప్రతి సినిమా టెక్నికల్ గా ఆడియన్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించడానికి తపన పడడంతోపాటు కథనంలో ఎక్కువగా సైంటిఫికల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకొనే విఐ.ఆనంద్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాకి కూడా అదే టైప్ ట్రీట్ మెంట్ ఇచ్చాడు.

అయితే.. ప్రేమ, ఆత్మల నేపధ్యంలో సాగే సినిమాలో లాజిక్ ను మాత్రం మిస్ అయ్యాడు. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే వదిలేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాపై అప్పటివరకూ ఏర్పడిన ఇంప్రెషన్ ను ఒక్కసారిగా తునాతునకలు చేసేసింది.

విశ్లేషణ : హారర్ సినిమా అనగానే ఓ నాలుగు దెయ్యం సీన్లు, రెండు కామెడీ సీన్లు మిక్స్ చేసేసి ఏదో అయ్యింది అన్నట్లు కాకుండా కాస్త వైవిధ్యభరితమైన కథనంతో, సెకండాఫ్ లో కాస్త బోర్ కొట్టించినా ఓవరాల్ గా పర్వాలేదనిపించే ప్రెడిక్టబుల్ థ్రిల్లర్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా”.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus