మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) కొన్నాళ్ల నుండి హిట్టు లేక సతమతమవుతున్నాడు. గతంలో రవితేజ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్ లో కానీ దర్శకనిర్మాతల్లో కానీ ట్రేడ్ వర్గాల్లో కానీ బలంగా ఉండేది. కానీ ఎప్పుడైతే పారితోషికాలకి ప్రాముఖ్యత ఇస్తూ కంటెంట్ లేని సినిమాలు చేస్తూ వచ్చాడో.. అప్పటి నుండి రవితేజ మార్కెట్ కూడా దెబ్బతింది. గతంలో హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో రవితేజ సినిమాలకి మంచి వసూళ్లు వచ్చేవి.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అయినప్పటికీ రవితేజ భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. రవితేజ సినిమాల్లో వచ్చిన ఇంకో మార్పు ఏంటంటే.. అతని సినిమాల్లో స్టార్ హీరోయిన్లు మిస్ అవ్వడం.రవితేజ సినిమాల కోసం స్టార్ హీరోయిన్లను తీసుకునే ఆలోచనలో ఇప్పుడు నిర్మాతలు లేరు.
ఈ విషయంలో కూడా రవితేజ అండ్ ఫ్యాన్స్ కాంప్రమైజ్ అవ్వకతప్పదు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ సినిమాలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్ళు స్టార్స్ కాదు. ఆషిక రంగనాథ్ కి సరైన హిట్టు లేదు. డింపుల్ హయాతికి అయితే ఈ మధ్య కాలంలో ఆఫర్సే లేవు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ చేయబోయే సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ను ఎంపిక చేసుకున్నట్టు స్వయంగా నిర్మాత ఇటీవల చెప్పడం జరిగింది.
గత 5-6 సంవత్సరాల్లో శ్రీలీల తప్ప రవితేజ ఎలాంటి స్టార్ హీరోయిన్‌తోనూ కలిసి పనిచేయలేదు.కొన్నాళ్ల నుండి చూసుకుంటే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నుపూర్ సనన్, అను ఎమ్మాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి వంటి హీరోయిన్లతో నటించాడు రవితేజ. వీళ్ళలో శ్రీలీల, మీనాక్షి, భాగ్యశ్రీ వంటి వాళ్ళు రవితేజ సినిమాల వల్లనే స్టార్స్ అయ్యారు.. తప్ప ముందు వాళ్లకి స్టార్ స్టేటస్ లేదు.