‘ఎపిక్’ సినిమా గురించి మొన్నీ మధ్య మాట్లాడుకుంటూ.. ఈ సినిమా ఒక పార్ట్ కాదు.. సీక్వెల్ కూడా ఉంది అని చెప్పాం. ఆ సమయానికి ఆ మాటలు ఊహ కావొచ్చు. కానీ సినిమా టైటిల్ చూశాక కచ్చితంగా ఇదే మాట ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే రెండు భాగాలుగా సినిమా తెరకెక్కించడం వల్లే ఈ సినిమాకు ‘ఫస్ట్ సెమిస్టర్’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే మాటను ఆ సినిమా దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా చెప్పేశారు. అవును ‘ఎపిక్’ సినిమాకు సీక్వెల్ ఉందని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య హాసన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, దాని సీక్వెల్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ‘ఎపిక్’ కథ మీ జీవితం నుండి వచ్చిందన్నారు కదా అని అడిగితే.. నిజ జీవితంలోని సంఘటనల స్ఫూర్తి ఉంది. అయితే, కథ రాసేటప్పుడు కాస్త స్వేచ్ఛ తీసుకున్నా అని చెప్పారు.
‘ఎపిక్’కి సీక్వెల్ ఉంటుంది అంటున్నారు నిజమేనా.. అని అడిగితే.. ‘ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్’ పేరుతో మరో సినిమా తీస్తున్నాం. ఈ సినిమా రెండు భాగాలుగా తీయాల్సిన కథ అని ముందు అనుకున్నాం అని చెప్పేశారు. ఆనంద్ దేవరకొండతోనే ఈ సినిమా తీయాలనుకున్నాను. కథానాయికగా వైష్ణవి బాగుంటుందని నిర్మాత నాగవంశీ సలహా ఇచ్చారు. అలా ‘బేబి’ కలయిక ఈ సినిమాకి మళ్లీ కుదిరిందని దర్శకుడు చెప్పారు.
‘#90స్’ యూనివర్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని అడిగితే.. ఆ సిరీస్‌లోని తమ్ముడి మీద ఒక సినిమా, అన్న, అక్క కథలతోనూ సినిమాలు చేయాలని చాలా రోజుల క్రితమే అనుకున్నాను. ఇదొక యూనివర్స్ తరహా ప్రయత్నం అని చెప్పారు. ‘ఎపిక్’ కథ 2017 – 18 కాలంఓ సాగుతుంది. అంతకుముందు పదేళ్లు వాళ్ల జీవితంలో ఏం జరిగిందనే విషయాలను ‘#90స్’ సిరీస్‌కి కొనసాగింపుగా సీజన్ 2, సీజన్ 3 చేస్తాను అని క్లారిటీ ఇచ్చారు.