గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పెద్ది’ (Peddi). సమ్మర్ రేసు నుంచి తప్పుకుని జూన్ నెలకు వాయిదా పడిన ఈ చిత్రం, ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ ఉన్న ఆ ఒక్క స్పెషల్ సాంగ్ కంప్లీట్ అయితే సినిమాకు గుమ్మడికాయ కొట్టేయడమేనని డైరెక్టర్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు చరణ్ పక్కన మాస్ స్టెప్పులు వేయబోయే ఆ బ్యూటీ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి.
అయితే ఇప్పుడు సంయుక్త మీనన్ ఈ సాంగ్ చేయబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోపక్క శృతి హాసన్ పేరు కూడా ట్రెండ్ అవుతుంది. గతంలో చరణ్-శృతి కాంబోలో వచ్చిన ‘ఎవడు’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి స్టెప్పులేస్తే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. శృతికి ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో మహేష్ ‘ఆగడు’ నాని ‘హాయ్ నాన్న’ చిత్రాల్లో మెరిసింది. కాబట్టి మేకర్స్ అప్రోచ్ అయితే ఆమె కచ్చితంగా నో చెప్పకపోవచ్చని టాక్.
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ షూట్‌ను మే ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే.. యశ్ ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడితే, జూన్ 4వ తేదీన ‘పెద్ది’ ని దించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈసారి పక్కా క్లారిటీ వచ్చాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నారు.
అటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ కంప్లీట్ చేశారని, వచ్చే నెల రెండో వారంలోగా మిగతా వర్క్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక టీజర్, రెండు పాటలు మినహా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమాపై అసలైన హైప్ క్రియేట్ చేయాలంటే ట్రైలర్ వదిలే వరకు ఆగాల్సిందే.