తెలుగు సినిమా అనే కాదు, ఇండియన్ సినిమాలో ప్రముఖ దర్శకుడు, టాప్ డైరక్టర్స్ అంటూ ఓ లిస్ట్ చేస్తే.. అందులో టాప్ ప్లేసుల్లో ఉండే దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు. దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. సినిమానే ఊపిరిగా జీవించిన దాసరి జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో ‘డైరెక్టర్స్ డే’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేదికపై దాసరి జాతీయ పురస్కారాల్ని ప్రముఖ హిందీ దర్శకుడు ఆర్. బాల్కి, యువ దర్శకుడు రామ్ జగదీశ్ అందుకున్నారు. ఈ క్రమంలో ఆర్.బాల్కి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఓ విషయంలో టాలీవుడ్‌ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి అని అన్నారు కాబట్టి. గొప్ప సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు భారతీయ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడి ప్రేక్షకులే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద సంపద అని కొనియాడారు.
టాలెంటెడ్ దర్శకులు, ప్రేక్షకుల ప్రేమ కారణంగానే తెలుగు సినిమా ఇప్పుడు భవిష్యత్ భారతీయ సినిమాగా అవతరిస్తోంది. తెలుగులో గొప్ప దర్శకులు చాలామంది ఉన్నారు. సింగీతం శ్రీనివాసరావుకు నేను పెద్ద అభిమానిని. ఇక బాలీవుడ్‌లో దర్శకుల సంఘం అనేది లేదు. ఆ విషయంలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ చాలా పాఠాల్ని నేర్చుకోవాలి అని బాల్కి చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల చరిత్ర ఉన్న బాలీవుడ్‌లో ఇప్పటివరకు దర్శకుల సంఘం లేకపోవడం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద దర్శకులు ఉన్న బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఈ ఆలోచన చేయకపోవడం ఏంటి అనేది తెలియడం లేదు.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఎక్కడో ఉండే నన్ను మోహన్‌బాబుగా పేరు మార్చి, డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్పించారు దాసరి నారాయణరావు అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఈ వేడుకని నిర్వహిస్తున్న తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు సంఘానికి రూ.15 లక్షలు ఆర్థిక సహాయం కూడా ఇస్తా అని చెప్పారు.