బాలీవుడ్ సినిమాలో ఓ రంగంలో స్టార్లు అనిపించుకున్న వాళ్లు… దర్శకుడిగా మారడం మనం గతంలో చూశాం. తాజాగా మరో స్టార్ ఇలా దర్శకుడిగా మారబోతున్నారట. అతనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా. సినిమా తారల పెళ్లికి, ఇతర శుభకార్యాలు… ఫ్యాషన్ షోలు, అవార్డు ఫంక్షన్లకు మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సుల్లోనే వస్తుంటారు మన తారలు. అలాంటి మనీశ్… ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నారట. డిజైనర్‌గా ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన మనీశ్ ఇప్పటివరకూ 800 చిత్రాలకుపైగా పని చేశారు.
కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ బాధ్యతల్ని నిర్వహిస్తుంటారాయన. మన హీరోలు, హీరోయిన్ల చమక్ చమక్ సూట్స్, డ్రెస్సులు ఆయన డిజైన్ చేసినవే. చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లుగా ఆయన ఈ రంగంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలో తొలిసారి మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా మనీశ్ మల్హోత్రా ఓ ప్రేమ కథను తెరకెక్కించడానికి కథను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. దేశ విభిజన సమయంలో సాగే ఈ సినిమా కథను సంగీత ప్రాధాన్యంగా తీర్చిదిద్దబోతున్నారట.
ఈ చిత్రాన్ని మనీశ్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించనున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఎవరు నటిస్తారు, ఎప్పుడు మొదలవుతుంది లాంటి వివరాలు ఇంకా తెలియరావడం లేదు.