Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

నేచురల్ స్టార్ నాని(Nani) కెరీర్‌కు సెప్టెంబర్ నెల ఎంతో ప్రత్యేకం. ఆయన హీరోగా సినీ పరిశ్రమకు పరిచయమైంది ఈ సెప్టెంబర్ నెలలోనే కావడం విశేషం. అంతేకాకుండా, కెరీర్ కాస్త డల్‌గా ఉన్న సమయంలో ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో అతనికి తిరిగి మంచి బ్రేక్ లభించింది కూడా ఈ నెలలోనే. ఇప్పుడు ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nani

ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నానికి సంబంధించి సెప్టెంబర్ నెల ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం రండి :

1) అష్టా చమ్మా (2008 సెప్టెంబర్ 5)

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతోనే నాని హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, నానిని హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో నాని మార్క్ కామిడీ టైమింగ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

2) భలే భలే మగాడివోయ్ (2015 సెప్టెంబర్ 4)

నాని వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ హిట్ ట్రాక్ ఎక్కించినా.. దాని క్రెడిట్ ఎక్కువ శాతం దర్శకుడు నాగ్ అశ్విన్, మరో హీరో విజయ్ దేవరకొండలకు వెళ్లిపోయింది. సరిగ్గా ఆ సమయంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ నాని కెరీర్‌లోనే అప్పటికి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మతిమరుపు కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాతో నాని సెప్టెంబర్ సెంటిమెంట్‌ బలపడింది.

3)మజ్ను (2016 సెప్టెంబర్ 23)

‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. అప్పట్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎబౌవ్ యావరేజ్ నుండి హిట్ రిజల్ట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

4)దేవదాస్ (2018 సెప్టెంబర్ 27)

కింగ్ నాగార్జునతో కలిసి నాని నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

5)నానీస్ గ్యాంగ్ లీడర్ (2019 సెప్టెంబర్ 13)

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ఓ ఊపు తీసుకొచ్చినప్పటికీ, కథలో వేగం తగ్గడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్‌ దగ్గరే ఆగిపోయింది.

6) వి (2020 సెప్టెంబర్ 5)

నాని కెరీర్‌లో 25వ సినిమాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరో. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం కోవిడ్ పరిస్థితుల కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. నేరుగా ఓటీటీలో రిలీజైన తొలి పెద్ద సినిమా ఇదే. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా.. వ్యూయర్‌షిప్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, నిర్మాతకు అలాగే ఓటీటీ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

7) టక్ జగదీష్ (2021 సెప్టెంబర్ 10)

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ‘నిన్ను కోరి’ కాంబో కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థియేట్రికల్ రిలీజ్ అని ప్రచారం చేసినా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల చేశారు. దీనికి కూడా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, వ్యూయర్‌షిప్ పరంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు బాగా కలిసొచ్చింది. నాని సినిమాలకు ఓటీటీ మార్కెట్ భారీగా పెరగడానికి ఈ చిత్రం కూడా ఓ కారణం అని చెప్పాలి.

ఇవి సెప్టెంబర్ నెలలో విడుదలైన నాని సినిమాలు, వాటి ఫలితాలు. ఓవరాల్‌గా చూసుకుంటే సెప్టెంబర్ నెల నానికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 24న రిలీజ్ కానున్న ‘ది ప్యారడైజ్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, ఈ సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఎలా కంటిన్యూ చేస్తుందో తెలియాలంటే.. ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి.

రణబాలి వాయిదా.. నిజమేనా?

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus