ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన గేమ్ ఛేంజర్ (Game Changer) . సినిమా పైరసీ వలన మరీంత నష్టాలు ఎదుర్కొంది. సినిమా విడుదలైన మరుసటి రోజే 4K ప్రింట్ లీక్ అవ్వడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. లేటెస్ట్ గా మరింత HD ప్రింట్ లీక్ అవ్వడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. ఈ లీక్ సినిమా వసూళ్లను నేరుగా దెబ్బతీసే ప్రమాదం ఉండటంతో మేకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల లీక్ అయిన ప్రింట్ విషయంలో పరిశీలిస్తే, ఇది పూర్తిగా హిందీ, తమిళ్ వెర్షన్లతో పాటు ఓటీటీలో వచ్చే క్లారిటీతో ఉందట. కొన్ని సన్నివేశాలు సీజీ పూర్తిగా చేయకపోవడం, డబ్బింగ్ పూర్తి కాలేదు అనిపించడంతో ఇది ఎడిట్ దశలోనే లీక్ అయ్యి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో చర్చ సాగుతున్న తీరు చూస్తుంటే, ఎడిటింగ్ రూమ్ నుంచే ఈ లీక్ అయ్యి ఉండొచ్చని కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాకి వర్క్ చేసిన వారిలో ఎవరో ఒకరు లీక్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి సంఘటనలు గతంలోనూ తెలుగుసినిమా పరిశ్రమలో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విడుదలకు ముందు లీక్ అయిన కొన్ని సినిమాలు పెద్ద సంచలనంగా మారాయి. తాజాగా జరిగిన ఈ ఘటన గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా లీక్‌ను తలపిస్తోంది. అప్పట్లో ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) లీక్ వెనుక చిత్ర యూనిట్‌లో పనిచేసిన వాళ్ల ప్రమేయం ఉండటంతో ఆ సమస్య పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విషయంలోనూ అదే తరహా ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.
పైరసీ సమస్యతో అందరూ కలిసి పోరాడే ప్రయత్నాలు మొదలైపోయాయి. మేకర్స్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ను సంప్రదించి ఈ లీక్ వెనుక ఉన్న వాళ్లను గుర్తించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పరిశ్రమలోని పెద్దలు పైరసీని పూర్తిగా అరికట్టే విధానాన్ని సీరియస్ గా పరిశీలించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. ఈ లీక్ ఘటన మెగా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సైబర్ నేరస్థులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.