Gangs Of Godavari Review in Telugu: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 31, 2024 / 01:50 PM IST

Cast & Crew

  • విశ్వక్ సేన్ (Hero)
  • నేహా శెట్టి (Heroine)
  • అంజలి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు (Cast)
  • కృష్ణ చైతన్య (Director)
  • సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య (Producer)
  • యువన్ శంకర్ (Music)
  • అనిత్ మదాడి (Cinematography)

విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో సాహిత్య రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య (Krishna Chaitanya) తెరకెక్కించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” (Gangs of Godavari). యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం ప్రత్యేక ఆకర్షణగా విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!


కథ: జీవితంలో ఎలాగైనా పైకి ఎదగాలి అనే ధ్యేయంతో సులభ మార్గలు ఎంచుకొనే యువకుడు లంకల రత్నాకర్ అలియాస్ రత్న (విశ్వక్ సేన్). కొవ్వూరు ఎమ్మెల్యే (గోపరాజు రమణ (Goparaju Ramana) వద్ద చేరి తిన్న చోటే గోతులు తవ్వి.. అపోజీషన్ పార్టీ పెద్ద (నాజర్ (Nassar) సహాయంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఎమ్మెల్యేగా గెలిచిన రత్న తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు? అందువల్ల ఏం నష్టపోయాడు? అనేది “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం చూసి తెలుసుకోవాల్సిన విషయం.


నటీనటుల పనితీరు: గోదావరి యాసను స్పష్టంగా పలకలేకపోయాడు కానీ.. రత్న అనే పాత్రలో జీవించేశాడు. ఆ పాత్రలో ఉన్న చీకటి కోణాన్ని తన నటనతో బాగా ఎలివేట్ చేశాడు. కొన్ని ఫ్రేమ్స్ లో మరీ నిండుగా గుండ్రంగా కనిపించినా.. పాత్ర బిహేవియర్ కి సరిపోయింది. ఆ యాస విషయంలో ఇంకాస్త కష్టపడి ఉంటే మాత్రం రత్న అనే పాత్ర విశ్వక్ కెరీర్ లో నిలబడిపోయేది. అంజలి (Anjali) ఈ సినిమాలో మంచి బరువైన పాత్రలో కనిపించింది. వేశ్య పాత్ర కదా అని ఎక్కడా తక్కువ చేసి చూపించలేదు. ఆమె తన నటనతో హుందాతనం తీసుకొచ్చి క్యారెక్టర్ ను ఎలివేట్ చేసింది.

నేహా శెట్టి (Neha Shetty) పాత్రకు మంచి ఎలివేషన్ ఉంది. కానీ.. ఆ పాత్రను తన స్క్రీన్ ప్రెజన్స్ తో మ్యానేజ్ చేయలేకపోయింది. కీలకమైన సన్నివేశాల్లో తేలిపోయింది. అందువల్ల సదరు సన్నివేశాలు సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. హైపర్ ఆది (Hyper Aadi) , పమ్మి సాయి కామెడీ పండించడానికి కాస్త ప్రయత్నించారు కానీ.. పెద్దగా వర్కవుటవ్వలేదు. ముఖ్యంగా హైపర్ ఆది సింగిల్ లైన్ పంచులు పెద్దగా పేలలేదు. గోపరాజు రమణ, నాజర్, సాయికుమార్ (Pudipeddi Sai Kumar)  తదితరులు తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: యువన్ శంకర్ రాజాను సంగీత ఎంపిక చేసుకోవడం చిత్రబృందం చేసిన ఏకైక మంచి పని. యువన్ తన నేపధ్య సంగీతం & పాటలతో రెగ్యులర్ సినిమాకి ఒక కొత్తదనం తీసుకొచ్చాడు. అనిత్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది కానీ.. ఎలివేట్ అవ్వాల్సిన కొన్ని షాట్స్ సరిగా కంపోజ్ చేయలేదు. అందువల్ల.. పేపర్ మీద బాగా రాసుకున్న కొన్ని ఎలివేషన్స్ ఆన్ స్క్రీన్ వర్కవుట్ అవ్వలేదు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వ ప్రతిభ నిజానికి బాగుంటుంది. “రౌడీ ఫెలో”లో రావు రమేష్ (Rao Ramesh) క్యారెక్టరైజేషన్ & కొన్ని షాట్స్ కంపోజ్ చేసిన విధానం అద్భుతంగా ఉంటాయి. అయితే..

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” విషయానికి వచ్చేసరికి తన దర్శకత్వ ప్రతిభను రాతకు మాత్రమే సరిపెట్టాడు కృష్ణ చైతన్య. అది కూడా ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్ గోదావరి పరవళ్ళల్లో కొట్టుకుపోయింది అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఫస్టాఫ్ లో చాలా కీలక సన్నివేశమైన రత్న ఎమ్మెల్యే ఇంట్లో కుర్చీ లాక్కొని కూర్చోనే సన్నివేశం రాసుకున్న విధానం బాగున్నా.. దాన్ని తెరకెక్కించిన తీరు మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

అలాగే.. సెకండాఫ్ లో రత్న డౌన్ ఫాల్ ను చూపించిన విధానం కానీ, కత్తి కట్టడం అనే ఆచారాన్ని ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న ట్విస్టులు, మంచి బిల్డప్ ఇచ్చిన జూనియర్ విలన్ క్యారెక్టర్ అన్నీ గోదాట్లో కలిసిపోయాయి. అందువల్ల “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”తో కృష్ణ చైతన్య దర్శకుడిగా, రచయితగా బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చాడనే చెప్పాలి.

విశ్లేషణ: విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్, యువన్ శంకర్ రాజా సంగీతం, ఫస్టాఫ్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాకి పాజిటివ్ పాయింట్స్ కాగా.. మిగతావన్నీ మైనెస్సులు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంత బాగా రాసుకొని సెకండాఫ్ కి వచ్చేసరికి ఎందుకని క్యారెక్టర్ ఆర్క్స్ మీద దృష్టిసారించలేదో అర్ధం కాదు. అయితే.. ఇవేమీ పట్టించుకోని మాస్ ఆడియన్స్ మాత్రం ఓ మోస్తరుగా ఆస్వాదించగల సినిమా ఇది!

ఫోకస్ పాయింట్: సెకండాఫ్ లో చతికిలపడ్డ గోదారోళ్ళ గ్యాంగ్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus