టీజర్‌లు చూసి, గ్లింప్స్‌లు చూసి.. సినిమా కథ, ఆ సినిమా మీద రాబోయే ఇబ్బందుల గురించి చెప్పేయొచ్చా అంటే.. కథ సంగతేమో కానీ.. ఇబ్బందుల గురించి అయితే కచ్చితంగా చెప్పేయొచ్చు. ఎందుకంటే మనోభావాల బ్యాచ్ ఎక్కువగా ఇలాంటి వీడియోలు చూసే సినిమాల వాళ్ల మీద ఆందోళన కత్తులు దూస్తుంటారు. ఇప్పుడు ‘జార్జ్ క్రిష్’ సినిమా విషయంలో ఇదే జరగబోతోందా? ఏమో ఆ వీడియో చూస్తుంటే ఇదే డౌట్ వస్తోంది.
నిజానికి ‘జార్జ్ క్రిష్’ సినిమా అనౌన్స్‌మెంట్ అయిన సమయంలోనే ఈ డౌట్ వచ్చింది. అయితే జార్జ్ ఇంకా క్రిష్ అనే రెండు పాత్రలకు సంబంధించిన కథేమో అనే డౌట్ ఒకటి ఉండింది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రమోషనల్ వీడియోలో ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు. శర్వానంద్ వివిధ కారణాల వల్ల రెండు పాత్రల్లోనూ కనిపిస్తాడు అని చెప్పకనే చెప్పారు. అయితే ఈ రెండు పాత్రల వేసేటప్పుడు వస్త్రధారణ, అమ్మాయిలతో డ్యాన్స్‌లు లాంటివి ఎబ్బెట్టుగా ఉన్నాయి.
ఒక్క వీడియోతో ఈ విషయం తేల్చలేం కానీ.. టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు కథాంశం మీద చాలా క్లారిటీ వస్తుంది. అప్పుడు ఈ సినిమా మనోభావాల బ్యాచ్ రాడార్‌లోకి వస్తుందో లేదో తేలిపోతుంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో అనిల్ సుంకర ఓ సినిమాను ప్రకటించారు. సినిమాకు క్లాప్ కొట్టిన రోజే టైటిల్, రిలీజ్ డేట్, డిస్ట్రిబ్యూటర్ల వివరాలు అన్నీ చెప్పేశారు. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింతపుతున్నాం అని చెబుతూ జనవరి 14 అంటూ రిలీజ్ డేట్ చెప్పేశారు.
టైటిల్‌లో ఓ జంట ప్రేమగా ఉన్నట్లు బొమ్మలు వేశారు. వెనుక హవర్ గ్లాస్ (గాజు సీసా తరహాలో ఏర్పాటులో ఇసుక కిందకు జారే టైమర్) ను పెట్టారు. అంటే సమయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఈ సినిమాలో శర్వాకు జోడీగా మానస వారణాసి నటిస్తోంది.