మేము ఫేమస్ మూవీతో హీరోగా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). తొలి సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సుమంత్ ప్రభాస్…రెండో మూవీ కోసం కోనసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. సుమంత్ ప్రభాస్ హీరోగా రూపొందిన గోదారి గట్టుపైన శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించాడు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ లో జగపతిబాబు, లైలా కీలక పాత్రల్లో కనిపించారు. వెరైటీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? హీరోగా సుమంత్ ప్రభాస్‌కు మరో హిట్టు దక్కిందా? లేదా? అంటే?
కథ: రాజు (సుమంత్ ప్రభాస్) పదో తరగతి వరకే చదువుకుంటాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఆటోడ్రైవర్‌గా మారుతాడు. ఇంజినీరింగ్ చదివే మాయతో (నిధి ప్రదీప్) ప్రేమలో పడతాడు. మాయ చదువులో టాపర్. తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) లోకంగా బతుకుతుంది. తండ్రి చెప్పిన వాడినే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. కానీ రాజు మాటలు, మంచితనం చూసి అతడిని ఇష్టపడుతుంది మాయ. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడం, రాజు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండటంతో శ్యాంబాబు కుట్రపన్ని మాయకు అతడిని దూరం చేస్తాడు? ఆ తర్వాత ఏమైంది? కూతురి ప్రేమను శ్యాంబాబు అర్థం చేసుకున్నాడా? రాజు మంచితనం అతడిలో మార్పును తీసుకొచ్చిందా? రాజు, మాయ ఒక్కటయ్యారా? వీరి ప్రేమకు రెహమాన్‌తో (సుదర్శన్) పాటు మిగిలిన స్నేహితులు ఎలాంటి సాయం చేశారు అన్నదే మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: ఆటోడ్రైవర్ పాత్రకు సుమంత్ ప్రభాస్ పూర్తిగా న్యాయం చేశారు. నాచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవర్ హీరోయిజం ఎలిమెంట్స్ లేకుండా సెటిల్డ్‌గా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది. తెలంగాణ కుర్రాడు అయిన గోదారి యాసలో డైలాగ్స్ చెప్పడం కోసం బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్ పాత్రకు నిధి ప్రదీప్ సెట్టయ్యింది. తక్కువ మేకప్‌తో కనిపించింది. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలు చేయడం జగపతిబాబుకు కొత్తేమీ కాదు. ఈజీగా శ్యాంబాబు క్యారెక్టర్‌ను ఓన్ చేసుకున్నారు. లైలా సినిమాలో ఉందంటే ఉంది. ఆమె క్యారెక్టర్‌కు సరైన జస్టిఫికేషన్, డైలాగ్స్ కనిపించవు. సుదర్శన్ కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. రాజ్‌కుమార్ కసిరెడ్డితో వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ మాత్రం అంతగా నవ్వించలేకపోయాచు. దేవిశ్రీప్రసాద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు: నాగవంశీ కృష్ణ బీజీఎమ్, పాటలు గతంలో వచ్చిన పలు సూపర్ హిట్ సినిమాలను గుర్తుకుతెచ్చాయి. ప్రభాస్ రిఫరెన్స్‌లు బాగానే వాడుకున్నారు. సినిమా నిడివి రెండున్నర గంటల కంటే తక్కువే కానీ లెంగ్తీ ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు. గోదారి జిల్లాల అందాలను డీవోపీ సాయి సంతోష్ స్క్రీన్‌పై అందంగా చూపించారు.
విశ్లేషణ: నిస్వార్థమైన ప్రేమకు కులమతాలు, ఆస్తులు, అంతస్తులు ఏవి అడ్డుగోడగా నిలవవనే కాన్సెప్ట్‌తో కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ సుభాష్ చంద్ర గోదారి గట్టుపైన సినిమాను తెరకెక్కించారు. తన తండ్రి కంటే అమితంగా తనను ప్రేమించే అబ్బాయి భర్తగా రావాలని కలలు కనే అమ్మాయి జీవితం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆమె లైఫ్‌లోకి వేరే మతానికి చెందిన భిన్న మనస్తత్వంతో కూడిన ఓ అబ్బాయి ఎలా ఎంటరయ్యాడు? ఈ క్రమంలో వారి ప్రేమలో ఎదురైన సంఘర్షణను ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్.
తండ్రిపై కూతురికి ఉన్న అతి ప్రేమ కొన్ని సార్లు ఎలా స్వార్థంగా మారుతుందన్నది ఆలోచనాత్మకంగా చెప్పారు. ప్రేమకు మనసులు కలిస్తే చాలని, కులాలతో పనిలేదనే మెసేజ్ ఇచ్చారు. ఈ సందేశాన్ని క్లాస్ ఇస్తున్నట్లుగా ఫోర్స్‌డ్‌గా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌గా కన్వీన్సింగ్‌గా చెప్పిన విధానం బాగుంది. ఆటోడ్రైవర్లు అనగానే చులకనగా చూస్తుంటారు. సినిమాల్లోనూ వారిని మాసీగా చూపించడం అలవాటైపోయింది. కానీ ఆటోడ్రైవర్లలో మంచి మనుషులు ఉంటారనే పాయింట్ కొత్తగా అనిపించింది.
కోనసీమ బ్యాక్‌డ్రాప్ ఈ ప్రేమకథకు ప్లస్సయ్యింది. డైలాగ్స్ కూడా కంప్లీట్ కోనసీమ యాసలోనే రాసుకున్నారు డైరెక్టర్. కోనసీమ కుర్రాళ్ల అల్లర్లు, వారి మధ్య ఉండే స్నేహాం, ఆత్మీయత ఎలా ఉంటాయన్నది నాచురల్‌గా ప్రజెంట్ చేశారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం.. మతాల ప్రస్తావన ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సెన్సిటివ్ టాపిక్‌ను మరి హైలైట్ చేయకుండా కథలోనే అంతర్భాగంగా చూపించారు.
శ్యాంబాబుకు కూతురిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత రాజు, అతడి స్నేహితుల పాత్రను పరిచయం, మాయను ప్రేమలో దించడానికి రాజు వేసే ప్లాన్స్ చుట్టూ ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్‌గా సాగతుంది. తండ్రి కోసం రాజు ప్రేమను మాయ కాదనే సీన్‌తోనే ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పంచుతుంది. మాయలోని కన్ఫ్యూజన్స్‌కు ఎలా సమాధానాలు దొరికాయనే అంశాలతో సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా చూపించారు. రాజు ఫ్యామిలీ ఎపిసోడ్, చెల్లెలి పెళ్లి ట్రాక్ ఆకట్టుకుంటాయి. రాజును మాయను విడగొట్టాలని అనుకున్న శ్యాంబాబు వేసిన ఎత్తు పర్వాలేదనిపిస్తుంది. మరీ సినిమాటిక్‌గా కాకుండా రియల్‌గా అలా జరగొచ్చు అనే ఫీల్ కలిగేలా ఆ ట్రాక్ రాసుకున్నారు. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.
గోదారి గట్టుపైన కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. ఈ పాయింట్‌తో తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. హీరోహీరోయిన్లు కలవడానికి, విడిపోవడానికి గల కారణాలను బలంగా రాసుకోలేకపోయారు. సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి పంచ్‌లు చాలా వరకు పేలలేదు. అరవ సినిమాలా కామెడీ చాలా లౌడ్‌గా అనిపిస్తుంది.
ఫోకస్ పాయింట్: గోదారి గట్టుపైన టైటిల్‌కు తగ్గట్లే స్వీట్ అండ్ సింపుల్ లవ్‌స్టోరీ.
రేటింగ్: 2.5/5