ఈరోజు (జూన్ 2న) సీనియర్ టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న(జూన్ 1న) సాయంత్రం మీడియాతో ముచ్చటించారు.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజై ‘ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఓటీటీలో (ఈటీవీ విన్) విడుదలయ్యాక మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని’ ఈ ప్రెస్ మీట్లో తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇకపై తాను కంటెంట్ ఉన్న సినిమాలే తీయాలని డిసైడ్ అయినట్లు కూడా చెప్పుకొచ్చారు గుణశేఖర్.మలయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’ లాంటి సినిమాలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఆ సినిమాలో హీరో కామన్ మెన్ గా ఉంటూ మైండ్ గేమ్ ఆడతాడని.. అదే కథను నేరుగా తెలుగులో తీస్తే గనుక, హీరోకి అనవసరమైన ఎలివేషన్ సీన్లు పెట్టి స్పాయిల్ చేస్తామంటూ గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన ‘ఒక్కడు’ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ‘అందులో పాతబస్తీకి చెందిన ఒక సాధారణ యువకుడు, తన కళ్లముందు అన్యాయం జరిగితే తట్టుకోలేని వ్యక్తిత్వం ఉన్న హీరో.. కర్నూల్ వెళ్లి అనుకోకుండా ఓ అమ్మాయిని సేవ్ చేసే ప్రాసెస్ లో పెద్ద ఫ్యాక్షనిస్ట్ తో గొడవ పెట్టుకోవడం’… ఇదంతా ఆర్గానిక్ ఫ్లోలో ఉంటుంది. అలా కాకుండా.. కేవలం మహేష్ బాబు ఇమేజ్ ని, కమర్షియల్ ఎలివేషన్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ కథ రాసి ఉంటే, ‘ఒక్కడు’ కాస్తా మరో ‘సైనికుడు’ అయ్యేదేమో” అని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు.