‘రామాయణం’.. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చదివినా.. ఒకటే అనుభూతి కలుగుతుంది. అయితే రాముడి చరితాన్ని చెప్పడంలో, చూపించడంలో, వినిపించడంలో తేడా ఉంటే.. ఆ అనుభూతి డబుల్ అవుతుంది. ఇప్పుడు చూపించడంలో లేటెస్ట్ సాంకేతికతను జోడించి కనుల పండువగా తెరకెక్కించారు నితీశ్ తివారీ. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యశ్ (Yash) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రూ.2000 కోట్ల ‘రామాయణం’ (Ramayana) ట్రైలర్ తాజాగా విడుదలైంది.
అంతర్జాతీయ స్థాయిలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తాం అని చెప్పిన టీమ్.. ‘స్పైడర్ మ్యాన్’ సినిమాతో కలిపి రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రారంభానికి ముందు ‘రామాయణ’ (Ramayana) ట్రైలర్ వేశారు. సినిమా ట్రైలర్‌ను విలన్‌తో (రావణుడు) ప్రారంభించారు. పాతాళ లోకం, ఇంద్ర లోకం నుండి భూలోకం.. ముల్లోకాలన్నింటినీ తన బలంతో హస్తగతం చేసుకున్న రాక్షస రాజు అనే ఎలివేషన్ డైలాగ్‌తో రావణుడు తెరపైకి వచ్చాడు. ఆ లుక్‌లో యశ్ కనిపించిన తీరు.. ఇంకెవరూ ఆ పాత్రకు సరిపోరు అనేలా ఉంది.
సృష్టికి ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షిస్తాడు అంటూ శ్రీరాముడు (Ranbir Kapoor) ఎంట్రీ ఇవ్వగా.. సీతగా (Sai Pallavi) సౌమ్యంగా, సుందరంగా దర్శనమిచ్చింది. దశరథుడి పుత్రకామేష్టి యాగం, శ్రీరాముని జననం, విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్లడం, శివధనుర్భంగం, సీతారాముల కల్యాణం, రాముడి 14 ఏళ్లు వనవాసం, శూర్పణఖ సన్నివేశాలు, రాముడిపై రావణుడు పగ తీర్చుకుంటాననడం ఈ ట్రైలర్‌లో చూడొచ్చు.
దాదాపుగా అందరికీ తెలిసిన కథనే అయినప్పటికీ దర్శకుడు నితీశ్ తివారీ ఎలా చూపిస్తారు అనే ఆసక్తి ఉండేది. అదే ఇప్పుడు విజువల్ వండర్‌లా విజువల్ ఎఫెక్ట్స్ వేసి చూపించారు. అయితే హనుమంతుడి పాత్రను మాత్రం ఇంకా చూపించలేదు. ఆ పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను 5 భాషల్లో (హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) విడుదల చేశారు. హిందీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. విడుదలైన మూడు గంటల్లోనే 1.2 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. తెలుగులో సుమారు మూడు లక్షల వ్యూస్ వచ్చాయి.