స్వరాల రారాజు మేస్ట్రో ఇళయరాజా

  • June 2, 2016 / 08:47 AM IST

సంగీత జగత్తు మెచ్చిన రాజా… మేస్ట్రో ఇళయరాజా. సహజ బాణీలు అందించి.. సౌత్ ఇండియాలోని మేటి సంగీత దర్శకుల జాబీతాలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నేటి అనేక మంది యువ సంగీత దర్శకులకు ఆయనే స్ఫూర్తి. ఇళయరాజా సినీ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

పేరు నిలబెట్టిన స్క్రీన్ నేమ్..
ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడులోని పన్నియపురంలో జన్మించా రు. స్కూల్ లో చేర్పించేటప్పుడు జ్ఞానదేశికన్ పేరుని ఆయన తండ్రి రాజయ్యగా రాపించారు. సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు రాజయ్య కాస్త రాజాగా మారారు. 1976 లో సంగీత దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. తొలిసారి రాజా ’అన్నకిలి (తమిళ్)’ సినిమా టైటిల్స్ లో ఇళయారాజాగా చూసుకున్నారు. ఆ స్క్రీన్ నేమ్ తోనే ప్రపంచానికి గుర్తుండి పోయారు.

తెలుగువారి గుండెల్లో..
అలసిన ప్రాణాలకు ఇళయరాజా పాటలు స్నానం చేయిస్తాయి. పిల్లలకు జోల పాట అవుతాయి. తెలుగులో అయన సంగీతం అందించిన ఆరాధన, అభిలాష, అభినందన, అన్వేషణ, బొబ్బిలిరాజా, దళపతి, గీతాంజలి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, సాగర సంగమం, స్వాతి ముత్యం… సినిమాల ద్వారా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు.

సంగీతమే ప్రాణం..
ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన “దళపతి” చిత్రంలోని “‘చిలకమ్మా చిటికెయ్యంగా” పాట బి.బి.సి. వారి పది అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. సంగీత సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో గౌరవించింది. ఇలాంటి ఎన్నో రికార్డులు, అవార్డులు ఆయన వద్దకు చేరినా.. అవన్నీ ఈ సంగీత మాస్టారీ వద్ద చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థుల్లా ఉంటాయి. ఈ నలభై ఏళ్ల వృత్తి జీవితంలో ఆయన వివిధ భాషలలో దాదాపు వెయ్యి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఐదు వేల పాటలకు జీవం పోశారు.

సుస్వరాల రారాజు ఇళయ రాజా జన్మదినం నేడు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నీ జరుపుకోవాలని, సంగీత తోటలో ఎన్నో మల్లెల రాగాల పువ్వులు పూయించాలని  ఫిల్మి ఫోకస్ కోరుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus