టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరు అంటే.. మొన్నీమధ్య చిరంజీవి రెండు పేర్లు చెప్పారు కానీ.. ఇంకా చాలామంది ఆ లిస్ట్‌లో ఉన్నారు. ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమాను ఓకే చేసి పట్టాలెక్కిస్తుంటాడు నందమూరి బాలకృష్ణ. తాజాగా ‘వీర సింహా రెడ్డి’ రిలీజ్ కూడా కాకుండానే అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ చేసేసి వావ్ అనిపించారు. అయితే ఇప్పుడు ఆ తర్వాతి సినిమా లెక్కలు కూడా చూస్తున్నాడు. ఈ క్రమంలో కొత్త దర్శకులు, పాత దర్శకులు కథ చెబుతాం అంటూ రెడీ అయిపోతున్నారు.
బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిగినా, వేరే సినిమా హీరో కార్యక్రమానికి బాలయ్య వెళ్లినా.. అక్కడ దర్శకులు బాలయ్యను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. ఓ కథ సిద్ధం చేస్తున్నానని, మీకు వినిపిస్తా అని చెబుతున్నారు. మామూలుగానే బాలయ్య భోళాశంకరుడు.. వెంటనే కథ వినడానికి ఓకే అంటున్నారు. తాజాగా అలా కథ గురించి బహిరంగ సభలో మాట్లాడారు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్. ‘వీరసింహుని విజయోత్సవం’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హరీశ్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘గోపీచంద్ మలినేనికి గుర్తు ఉందో? లేదో? ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసింది నేనే. ‘నువ్వు ఎప్పుడూ బాలకృష్ణను డైరెక్ట్ చేయలేదు కదా! రేపు ఓపెనింగ్ ఉంది. వచ్చి ఒక్క షాట్ చెయ్’ అని నన్ను పిలిచాడు. ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంటే… రేపు మొత్తం సినిమా డైరెక్ట్ చేస్తే? అదిరిపోతుంది కదా. అతి త్వరలో బాలయ్య బాబును మంచి కథతో ఒప్పించి, అనుమతి తీసుకుని సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నా.
ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు, మా నిర్మాతల కోరిక కూడా’’ అని చెప్పారు హరీశ్ శంకర్. టాలీవుడ్లో పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అనే దర్శకుల జాబితా తీస్తే అందులో తొలి స్థానాల్లో హరీశ్ శంకర్ పేరు ఉంటుంది. అలాంటి హరీశ్ శంకర్ బాలయ్యతో సినిమా అంటే వావ్ అనే అనాలి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్‌లో అంటే ఇంకా అదిరిపోతుంది. సో ఫ్యాన్స్ వెయిటింగ్. అన్నట్లు ఆ మధ్య ఏదో కార్యక్రమంలో దర్శకుడు పరశురాం కూడా ఇలానే బాలయ్యతో సినిమా చేస్తా అన్నట్లు గుర్తు.