సినిమా నేపథ్యం లేకపోయినా.. భారీ పోటీని తట్టుకొని డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. కొన్నేళ్లుగా హిట్ లేకపోవడంతో తెరమరుగు అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలు బీట్ చేస్తూ పీఎస్వీ గరుడ వేగ తో దూసుకువచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రాజశేఖర్ కి పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. దీంతో అతనితో సినిమాలు తీయడానికి సీనియర్ డైరక్టర్స్ సైతం ఆసక్తి కనబరిచారు. అయితే రాజశేఖర్ మాత్రం కొత్త దర్శకునితో పనిచేయడానికి ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.
డైరెక్టర్ మణిరత్నం దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గోపి చెప్పిన లైన్ బాగుండడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. రాజశేఖర్ ఇమేజ్ కి తగినట్లు భారీ యాక్షన్ కథని గోపి సిద్ధం చేశారని తెలిసింది. అతను ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వివరాలను రేపు ( ఫిబ్రవరి 4 ) రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో నటించనున్న ఆర్టిస్టులతో పాటు ఇతర టెక్నీషియన్ల వివరాలను కూడా ఆదివారం వెల్లడించనున్నారు.