‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ వంటి వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్.. మరో రెండు రోజుల్లో అంటే జూలై 14న ‘ది వారియర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ ‘వారియర్’ టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ‘బుల్లెట్ బండి’ ‘విజిల్’ వంటి పాటలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా రామ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ప్రశ్న: ‘ది వారియర్’ కంటే ముందు కొన్ని కథలు రిజెక్ట్ చేశానని చెప్పారు. ఈ కథ మిమ్మల్ని అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఏమైనా ఉందా?
రామ్: పోలీస్ రోల్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. నాలుగైదు కథలు విన్నాను.కానీ అవి రొటీన్ గా అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలని అనుకున్నాను. లింగుస్వామి గారు కథ చెప్పడానికి వస్తానంటే ఓకే అని చెప్పాను.ఆయన పోలీస్ కథతో నా దగ్గరకి వస్తున్నారు అని ఆ టైంలో నాకు తెలీదు. కథ చెప్పే ముందు నాకు అది పోలీస్ కథ అని తెలిసింది. ఇది కూడా రొటీన్ గా ఉంటుందేమో ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకున్నా..! వినడం మొదలుపెట్టాక ఇలాంటి కథే చేయాలని డిసైడ్ అయ్యాను. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది.
అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. ‘ది వారియర్’ లో ఆ సోల్, ఎమోషన్ ఉంది. అదే నాకు బాగా నచ్చింది. ‘మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?’ అని అడిగితే… ‘కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను చూసి కథ రాశా’ అని ఆయన చెప్పారు. నిజంగా కొందరు పోలీసులు అలా ఉన్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కథ విన్నప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే… లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించేశాను.
ప్రశ్న: ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మాస్, కమర్షియల్ సినిమాలకే పెద్ద పీట వేస్తున్నట్టున్నారు?
రామ్: ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందే మారింది.(నవ్వుతూ). అందుకే, ఆ సినిమా చేశా.
ప్రశ్న: జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా? అని డాక్టర్ ప్రశ్నించారని చెప్పారు. అంతలా ఏమైంది?
రామ్: కొంచెం సీరియస్ ఇంజ్యూరీ అయ్యింది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా! ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్ అలా ప్రశ్నించే సరికి… ‘అలా అడిగారు ఏంటి?’ అనుకున్నాను. తర్వాత వారానికి సెట్ అయ్యాను. అప్పటికి ఆది పినిశెట్టి వేరే సినిమాలు చేయకుండా అలా ఉన్నాడు. పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన కరెక్ట్. నాకు ఏమో నా వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారు అని నా ఫీలింగ్. సినిమాలే లైఫ్ అనుకునే నాకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది.
ప్రశ్న: ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే కాకుండా దానికి ముందు వెనుక మీరు చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ లింగుస్వామి గారికి ఈ మధ్య హిట్లు లేవు. ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
రామ్: అలాంటి లెక్కలు వేసుకుంటే ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా చేసేవాడిని కాదు కదా.! పూరి జగన్నాథ్ గారు, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు కానీ… వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి… ఓ కరెక్ట్ స్క్రిప్ట్ ను పడితే రిజల్ట్ బాగుంటుంది అనేది నా నమ్మకం. లింగుస్వామి గారు కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయ్యాం. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ మెరుస్తూనే కనిపిస్తుంది.
ప్రశ్న: ఆది పినిశెట్టి ని విలన్ గా తీసుకోవాలి అనే ఐడియా ఎలా వచ్చింది?
రామ్: కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్… గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? అనేది నా టెన్షన్. అయితే, లింగుస్వామి గారు ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆది సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథ చెప్పాక… ఆయన కూడా ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే ఓకే చెప్పేసి క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.
ప్రశ్న: బుల్లెట్, విజిల్ సాంగ్స్ ఛార్ట్‌బస్టర్స్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పండి..!
రామ్: మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఇది 7వ సినిమా. లింగుస్వామి గారు స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి… రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్స్ ల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్లో వేరు. ఒక్కో స్పీకర్లో సాంగ్ ఎలా రావాలి? అనే విషయం పై ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు… కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్… కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ అనిపిస్తుంది.
ప్రశ్న: శింబు తో బుల్లెట్ సాంగ్ పాడించాలని ఎందుకు అనిపించింది.?
రామ్: తమిళంలో శింబు ‘లూసు పెన్నే’ అని ఒక పాట పాడారు. ‘బుల్లెట్…’ పాటకు శింబు అయితే బావుంటుందని చెప్పగానే నాకు ఆ వాయిస్ గుర్తు వచ్చింది. తెలుగులో 80 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తమిళంలో 70 మిలియన్ ప్లస్ వచ్చాయి. తమిళంలో అంత రీచ్ రావడానికి శింబు కారణం. ఓ విధంగా ‘వారియర్’ కూడా అది బాగా ప్లస్ అయ్యింది.
ప్రశ్న: ఈ మూవీతో మీరు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రిలీజ్ కు ముందు ఎలా అనిపిస్తుంది?
రామ్: నేను చాలా కాలం నుండి తమిళ్ లో సినిమా చేయాలనుకుంటున్నాను.కానీ కథ సెట్ అవ్వేలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్… రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి గారు చెప్పిన ‘వారియర్’ స్క్రిప్ట్ తో అది కుదిరింది.
ప్రశ్న: తమిళ్ లో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది. ఫాస్ట్ గా చెప్పారు అని విన్నాం!
రామ్: నేను చెన్నైలో పెరిగాను కదా! తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. నేను ఒక్కడినే డబ్బింగ్ చెబుతా. వేరే వాళ్ళు ఉండటం ఇష్టం ఉండదు. కరెక్షన్స్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. లింగుస్వామిగారితో అదే చెప్పాను. నేను మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతాను అన్నాను. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి గారు షాక్ అయ్యారు. ‘అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు’ అని నాతో అన్నారు.
ప్రశ్న: శ్రీనివాసా చిట్టూరి గారితో మరో సినిమా కూడా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది?
రామ్: ‘మీతో పని చేసిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ మీతో చేస్తున్నారు’ అని మొన్నే ఆయనతో అన్నాను. ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడరు. చాలా సైలెంట్. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను చేయబోయే సినిమాకు ఆయన నిర్మాత. ఆయన దేనికి కంగారు పడరు. ఆయనకి ఏమి కావాలో క్లారిటీ ఉంటుంది. అందుకే పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.
ప్రశ్న: కృతి శెట్టి తో వర్క్ చేయడం ఎలా నిపించింది?
రామ్: ఆమె డెడికేషన్ అందరికీ నచ్చుతుంది. వర్క్ పై ఆమెకు గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి అని నా ఫీలింగ్.
ప్రశ్న: మోకాలికి గాయమైనా సాంగ్ షూటింగ్ చేశారట?
రామ్: అంత అవసరమా.. అని చాలామంది అడుగుతున్నారు. అవసరం లేదని చాలా మంది చెబుతున్నారు. దర్శకులు కూడా! కానీ, ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోసం చేయాలని నాకు అనిపించింది… చేస్తున్నాను. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే… నేను చేయగలను అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంది. అందుకే చేస్తున్నాను.
ప్రశ్న: బోయపాటితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారుగా…?
రామ్: నా సినిమాలు హిందీ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బోయపాటి గారి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని, భారం అంతా ఆయన మీదే వేశాను.
ప్రశ్న: మీకే తెలియని మీ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పండి.
రామ్: ఏం చెప్పాలి? ఆ అమ్మాయిని అడిగి నాకు చెప్పండి. నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే… ‘సీక్రెట్ గా చైల్డ్‌హుడ్ గర్ల్ ఫ్రెండ్ తో’ అని రాశారు. ఇంట్లో వాళ్ళు కూడా డౌట్ డౌట్ గా చూడటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ కూడా నెమ్మదిగా ‘మాకే తెలియకుండా ఏంటిది?’ అని ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ‘ఏం లేకుండా రాస్తారంటావా?’ అనే క్వశ్చన్ వచ్చింది. అందుకే, జెన్యూన్ గా అడిగా… నేను స్కూల్ కి ఎప్పుడు వెళ్లానని!
ప్రశ్న: హిందీలో మీ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. హిందీ ప్రేక్షకుల కోసం స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలని భావిస్తున్నారా?
రామ్: హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు అనేది నా నమ్మకం. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తారు.. కానీ తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనం కన్ఫ్యూజ్ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు.మన సినిమాలు హిందీలో డబ్ అయినప్పుడు చూశారు. సో కొత్తగా ఏమి చేయనవసరం లేదు.
ప్రశ్న: హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి తో సినిమాలు ఉన్నాయట?
రామ్: ప్రస్తుతానికి అందరితోనూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు సినిమా ఉంటుందనేది ఇప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుంది. కరోనా వల్ల మనకు బ్రేక్స్ వచ్చాయి. ‘ది వారియర్’ రిలీజ్ అయ్యాక బోయపాటి శ్రీను గారి సినిమా స్టార్ట్ చేస్తాను.
ప్రశ్న : ఫైనల్ గా ‘ది వారియర్’ గురించి ప్రేక్షకులకు ఒక్క మాటలో ఏం చెబుతారు?
రామ్ : ఇది థియేటర్ లో చూడటం కోసం తీసిన సినిమా. హ్యాపీ గా థియేటర్ లో చూడండి. ఎంజాయ్ చేయండి.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!