హీరో శ్రీకాంత్… తెలుగులో పరిచయం అక్కర్లేని పేరు. 1991లో పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమా ద్వారా నట జీవితం ప్రారంభించిన శ్రీకాంత్ ఇప్పటి వరకు దాదాపు 125కుపైగా సినిమాల్లో నటించారు. విలన్ పాత్రలు, హీరో పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడంతో విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం హీరోగా పెద్దగా ఆఫర్లు రాకపోతుండడంతో ఆయన త్వరలోనే తండ్రిగానూ నటించనున్నాడని తెలుస్తోంది.
2017లో “సంతు” దర్శకత్వంలో కన్నడలో వచ్చిన ‘కాలేజ్ కుమార’ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ దర్శకుడే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడు. కన్నడలో విక్కీ వరుణ్ హీరోగా చేయగా .. తండ్రి పాత్రను రవిశంకర్ పోషించాడు. తెలుగులో హీరోగా రాహుల్ విజయ్ ను ఎంపిక చేసుకున్నారు. ఆయన తండ్రి పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఇక తమిళంలో హీరో ఎవరనే విషయంలో స్పష్టత రాలేదుగానీ, తండ్రి పాత్ర కోసం ‘ప్రభు’ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.