ప్రముఖ హాలీవుడ్ సీనియర్ నటి ఇవా మేరీ సెయింట్ (102) ఇటీవల కన్నుమూశారు. లాస్ ఏంజిలెస్‌లోని తన ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు అని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధాప్య కారణాలతోనే ఆమె కన్నుమూశారు. 1924లో న్యూజెర్సీలోని నెవార్క్‌లో జన్మించిన మేరీ సెయింట్.. నాటక రంగంపై ఆసక్తితో న్యూయార్క్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ నాటకాల్లో నటించారు. టీవీ, రంగస్థల దర్శకుడు జెఫ్రీ హేడెన్ ఆమె భర్త.
1940 చివరిలో టీవీలో నటిగా కెరీర్‌ని ప్రారంభించిన మేరీ సెయింట్.. ‘ఆన్ ది వాటర్‌ఫ్రంట్’ సినిమాతో ఆమెకు క్రేజ్ వచ్చినప్పటికీ.. బిడ్డతో సమయాన్ని గడిపేందుకు భారీ సినిమాల ఆఫర్లను వద్దనుకుని విరామం తీసుకున్నారు. అయితే ఆమెను తిరిగి సినిమాల్లోకి తెచ్చింది ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్. ‘నార్త్ బై నార్త్ వెస్ట్’ సినిమాతో ఆమె రీంఎట్రీ ఇచ్చారు. అప్పుడు ఆమెను ఒప్పించింది భర్త జెఫ్రీ హేడెన్.
అలా రీఎంట్రీ ఇచ్చిన మేరీ సెయింట్ 90 ఏళ్ల వయసు దాటినా నటనని కొనసాగించారు. 1980లో ‘మూన్ లైటింగ్’, ‘నథింగ్ ఇన్ కామన్’ తదితర సినిమాల్లో తల్లి పాత్రలతో మెప్పించారు. ‘బికాజ్ ఆఫ్ విన్ డిక్సీ’, ‘సూపర్‌మ్యాన్ రిటర్న్స్’, ‘వింటర్స్ టేల్’ సినిమాల్లో అలరించారు. ‘ఆన్ ది వాటర్‌ఫ్రంట్’ సినిమాతో 1954లో ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1990లో ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.