‘రాకా’ సినిమా కథేంటి, సినిమాలో నటిస్తోంది ఎవరు, సినిమా ఎప్పుడు వస్తుంది.. ఇలాంటి విషయాల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తోపాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి టీమ్ ఏమీ చెప్పడం లేదు. కానీ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు మాత్రం చాలా చెబుతున్నారు. అలా మరో విషయం చెప్పుకొచ్చారు సినిమా దర్శకుడు అట్లీ. ఇటీవల తనకు, ‘రాకా’ సినిమా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌కి ఏం జరిగిందో చెప్పారు.
ఆయన చెప్పిన మాటల క్లైమాక్స్ విన్నాక అభ్యంకర్ సత్తా ఏంటో తెలుస్తుంది. అంతకుముందు ఆయన చెప్పిన మాటలు చూస్తే.. ముఖాలను గుర్తుపట్టకపోతే విదేశాల్లో ఏం అవుతోంది అని అర్థమవుతోంది. ‘రాకా’ సినిమా సంగీతం కోసం లండన్‌లోని అబ్బే రోడ్ స్టూడియోస్‌కి వెళ్లారట. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత సంగత దర్శకులు, మ్యుజీషియన్స్ పని చేశారు. వాళ్లు ‘అవతార్’ లాంటి సినిమా కోసం హాన్స్ జిమ్మర్‌కి పని చేసినవారు. దీని బట్టి ఆ స్టూడియో ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు.
ఇక అక్కడకి అట్లీ, అభ్యంకర్ వెళ్లినప్పుడు ఏం జరిగిందంటే.. వాళ్లు తీసుకెళ్లిన మ్యూజిక్ నోట్స్ ఇచ్చాక అక్కడ సిబ్బంది వారిని బయటనే కూర్చోమన్నారట. దాంతో ఇద్దరూ బయటే ఉండిపోయారట. కాసేపటికి తాము కూడా వెళ్లి మ్యూజిక్ కంపోజిషన్ చూడొచ్చా అని అడిగితే.. కాసేపటికి సిబ్బంది అంగీకరించారట. అలా లోపలకు వెళ్లి చూశారట. మొత్తం కంపోజిషన్ అయిపోయాక.. ఆ నోట్స్ సిద్ధం చేసింది సాయి అభ్యంకర్ అని తెలిసి.. మ్యుజీషియన్స్ వచ్చి హత్తుకున్నారు. అది తమకు ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచింది అని అట్లీ చెప్పారు.
ఈ లెక్కన ఈ సినిమాకు ప్రఖ్యాత మ్యుజీషియన్స్ పని చేశారు అని.. తమ టీమ్ టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అని చెప్పకనే చెప్పారు అనిపిస్తోంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రెండు పార్టులుగా తెరకెక్కుతుంది అంటున్న ఈ సినిమా తొలి భాగం 2027లో మరో 2028లో రిలీజ్ చేస్తారట.