గౌతమీపుత్ర శాతకర్ణికి నో చెప్పిన హేమ మాలిని

బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో హేమ మాలిని తల్లి పాత్రలో కనపడనున్న సంగతి తెలిసిందే. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శాతకర్ణి తల్లి గౌతమిగా నటిస్తోన్న ఈ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ తొలుత ఈ సినిమాకి నో చెప్పిందట. దానికి కారణం భాషేనని ఓ పత్రికవారితో చెప్పుకొచ్చింది హేమ మాలిని. తెలుగు భాష తనకు ఏమాత్రం తెలీదంటోన్న హేమ మాలిని ఇప్పుడు కూడా తన మాతృ భాష అయిన తమిళంలో డైలాగులను రాసుకుని సెట్లో చెబుతోందట. అలా అని తెలుగులో తనకిదే తొలి సినిమా అంటే పొరపాటే. ఇది తన మూడో చిత్రం.

1961లో ‘ఇదు సత్యం’ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన హేమ మాలిని 1965లో వచ్చిన తెలుగు చిత్రం ‘పాండవ వనవాసం’లో ఓ గీతంలో తళుక్కున మెరిసింది. అక్కడికి ఆరేళ్ళ తర్వాత ‘శ్రీ కృష్ణ విజయం’ సినిమాలో చేసిన రంభ పాత్రతో తెలుగు సినిమాలకు స్వస్తి పలికింది. ఈ రెండు సినిమాల్లో ప్రధాన పాత్రధారి నందమూరి తారక రామారావే అన్నది తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బాలయ్య సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల హేమ మాలిని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సెట్లో బాలయ్య తన మొబైల్ లో ఎన్టీఆర్ సినిమాలను చూపిస్తుండటం మాటల్లో చెప్పలేని అనుభూతి అని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus