పోకిరి సినిమా 12 ఏళ్ళు పూర్తి చేసుకోవడంపై ఇలియానా

ఏప్రిల్‌ 28 .. ఈ తేదీ తెలుగు చిత్ర పరిశ్రమకి బాగా కలిసివచ్చే తేదీలాగా కనిపిస్తోంది. గత ఏడాది ఈ డేట్ న రిలీజ్ అయిన బాహుబలి కంక్లూజన్ ఇప్పటివరకు రికార్డులను తిరగరాస్తూనే ఉంది. పన్నెండేళ్ళక్రితం ఇదే రోజు మరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయింది. అదే పూరి జగన్నాథ్ సృష్టించిన ‘పోకిరి’. సూపర్ స్టార్ మహేష్ బాబు కి స్టార్ డమ్ ని పెంచిన మూవీ ఇది. ఎటువంటి అంచనాలు లేకుండా 397 తెరలపై విడుదలైన ‘పోకిరి’ 350కు పైగా సెంటర్లలో 50రోజులు, 200 సెంటర్లలో 100రోజులు ఆడింది. ఇక 63 సెంటర్లలో 175, 15 కేంద్రాల్లో 200రోజులు ప్రదర్శించబడింది. కర్నూలు భగీరథ థియేటర్‌లో 365 రోజులు ఆడిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రికార్డుల పరంగానే కాకుండా కలక్షన్ల విషయంలోనూ దుమ్మురేపింది. 54కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఆ మధురమైన విజయాన్ని నిర్మాతల్లో ఒకరైన ఇందిరా ప్రొడక్షన్స్ వారు గుర్తుచేసుకున్నారు. “మా బ్యానర్ నుంచి వచ్చిన మరిచిపోలేని మాస్టర్ క్లాస్ చిత్రం పోకిరి” అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అందుకు గోవాబ్యూటీ ఇలియానా స్పందించింది. ఈమెకు దేవదాస్ తొలి తెలుగు చిత్రం అయినప్పటికీ పోకిరితో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆమె కూడా ఆనతి రోజులను గుర్తుకు తెచ్చుకుంది. “నమ్మలేకపోతున్నా. నా కెరీర్ ని మలుపు తిప్పిన పోకిరి సినిమా వచ్చి 12 ఏళ్ళు అవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ సినిమాతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి” అని రీ ట్వీట్ చేసింది. టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో అవకాశం రావడంతో అటు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగులో నటించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus