పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు.. ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ టీమ్ పని చేయడం, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పని చేయడం అంటూ.. ఇప్పుడు గొప్పగా చెబుతున్నారు కానీ.. ఇలాంటి సెటప్ టాలీవుడ్‌లో ఎప్పుడో చూసేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా పూర్తవ్వలేదు. ఒకవేళ షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ అయి ఉంటే ‘మీరు ఇప్పుడు చెబుతున్నవన్నీ మా హీరో ఎప్పుడో చేసేశాడు’ అని చిరంజీవి ఫ్యాన్స్ చెప్పేవారు. ఎందుకంటే మేం చెప్పిన సినిమా ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ కాబట్టి.
ఎప్పుడో మొదలై, ఎప్పుడో ఆగిపోయి.. దాదాపు అందరూ మరచిపోయిన ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అంటున్నారా? అప్పట్లో ఆ సినిమా కోసం పని చేసిన దర్శక ద్వయం పుష్కర్ – గాయత్రి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి. ‘విక్రమ్ వేద’ సినిమాతో అలరించిన వీరు ఇప్పుడు వరుస వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. అవే ‘సుడల్’, ‘వదంతి’. ఇప్పుడు ‘వదంతి 2’ వెబ్‌సిరీస్‌తో వచ్చారు. ఆ సిరీస్ ప్రచారంలో భాగంగా ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ / ‘ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ సినిమా గురించి మాట్లాడారు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో గాయత్రి ఆ సినిమాకు సహాయక దర్శకురాలిగా పనిచేయగా, కెమెరా విభాగంలో పుష్కర్ పని చేశారట. అప్పట్లో ఈ సినిమాకు దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్ అనుకున్నారట. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించాలి అనుకున్న ఆ సినిమా ఇండియన్ వెర్షన్‌కు సురేశ్ కృష్ణ దర్శకత్వం చేయాల్సి ఉండగా.. ఇంగ్లీష్ వెర్షన్‌కు డచెన్ జెర్సీ అనే హాలీవుడ్ దర్శకుడు అనుకున్నారట. హాలీవుడ్ నుండే కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియా నుండి సినీ నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారట.
ఈ సినిమా షూటింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చేయాలనుకున్నారట. తొలుత మూడు నెలల పాటు అజంత, ఎల్లోరా, ఔరంగాబాద్, రాజస్థాన్, జైపూర్, జైసల్మేర్, థార్ ఎడారిలో చేశారట. ఈ సినిమా కోసం అప్పట్లో అరుదుగా వాడే కెమెరా మోషన్ కంట్రోల్ రిగ్స్‌ను తొలిసారి ఇండియాకు తీసుకొచ్చారట.