‘స్పిరిట్’ సినిమా కోసం అనౌన్స్‌మెంట్ నుండి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే అందులో ఓ కారణం.. ఇప్పటివరకు ప్రభాస్ పోలీసుగా ఏ సినిమా కూడా చేయకపోవడమే. ప్రభాస్ కటౌట్‌కి పోలీసు యూనిఫామ్ పడితే.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనే నమ్మకంగా చెబుతున్నారు సినిమా పరిశీలకులు కూడా. అందుకే ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఇట్టే వైరల్ అయ్యి.. హిట్ అయిపోతోంది. కానీ ఈ మేనియాను గతంలో ఓసారి మిస్ అయ్యారు అని తెలుసా?
తమిళంలో అన్నదమ్ములు కలసి రూపొందించిన ‘తని ఒరువన్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో మీకు తెలుసు కదా? పోలీసు కథల్లో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. జయం మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో జయం రవి హీరోగా నటించాడు. రివేంజ్ డ్రామానే కావొచ్చు కానీ చూపించిన విధానం హైలైట్. ఆ సినిమానే ప్రభాస్ మిస్ అయ్యాడు. ఈ సినిమా కథను మోహన్ రాజా తొలుత ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రాశారట. ఈ విషయం ఆయనే చెప్పారు.
ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రాశారు అంటే.. తెలుగులోకి డబ్బింగ్ చేయడానికి అనుకునేరు. తమిళంలో ‘తని ఒరువన్’గా సిద్ధం చేసే క్రమంలో ప్రభాస్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారట మోహన్ రాజా. అయితే ఆ తర్వాత వివిధ కారణాలు, పరిణామాల నేపథ్యంలో ఆ సినిమాను జయం రవితో చేశారు. ప్రభాస్ వరకు కథ వచ్చింది లేనిది మోహన్ రాజా చెప్పలేదు కానీ.. ఏదో కారణం చేత రిజక్ట్ అయింది అని సమాచారం. అలా పోలీసుగా ప్రభాస్‌ను చూసే ఛాన్స్ ఫ్యాన్స్ మిస్ చేసుకున్నారు.
ఇక అదే సినిమాను తెలుగులో ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. సురేందర్ రెడ్డి ‘తని ఒరువన్’ కథను తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. అలా బెస్ట్ ఫ్రెండ్ చేసిన సినిమాను తొలుత ప్రభాస్ మిస్ అయ్యాడన్నమాట.