‘ఇరుముడి’ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ద సినిమా ‘ది ప్యారడైజ్'(The Paradise). నాని సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. ఇది ‘ఇరుముడి’ కంటే పెద్ద సినిమా అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. సినిమాకి కావాల్సిన బజ్ వచ్చేసింది. దీంతో ‘ట్రైలర్ కూడా అవసరం లేదు’ అని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో ‘దసరా’ వంటి హిట్ సినిమా వచ్చింది. నాని కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ అంటే అదే..! అదే కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’ పై బయ్యర్స్ కూడా భారీగానే నమ్మకాలు పెట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ట్రేడ్ మొత్తం ఓ విషయంలో గట్టిగా చర్చించుకుంటుంది. అదే.. ‘ ‘ప్యారడైజ్’ సినిమా ‘ఇరుముడి’ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందా?’ అని..! ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆల్మోస్ట్ రూ.250 కోట్లకి పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సొ ‘ప్యారడైజ్’ సినిమా అంత మొత్తంలో కలెక్ట్ చేస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అది పక్కన పెట్టేస్తే.. కచ్చితంగా ‘ప్యారడైజ్’ సినిమా అంతకు మించి కలెక్ట్ చేయాలి అనేది ఇండస్ట్రీ అభిప్రాయం.
ఎందుకంటే.. ‘ఇరుముడి’ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.20 కోట్లు మాత్రమే. రిలీజ్ కి ముందు ఆ సినిమాపై కొద్దిపాటి హైప్ ఉంది. మినిమమ్ గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు నమ్మారు. టికెట్ రేట్లు వంటివి పెంచింది లేదు. ప్రీమియర్ షోలు వంటివి వేసింది కూడా లేదు. అయినప్పటికీ అంత మొత్తం కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక ‘ప్యారడైజ్’ సినిమా విషయానికి వస్తే.. ప్రీమియర్ షోలు పడనున్నాయి. టికెట్ రేట్లు కూడా పెంచారు.
కాకపోతే సెన్సార్ వారు ఈ సినిమాకి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అదే పెద్ద డిజడ్వాంటేజ్. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్..కి, ముఖ్యంగా పిల్లలతో వెళ్ళేవాళ్ళకి మల్టీప్లెక్సుల్లో ఎంట్రీ ఉండదు. ‘ఇరుముడి’ సినిమాకి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి వెళ్లారు. దానికి అది కలిసొచ్చింది. అలాగే ‘ప్యారడైజ్’ సినిమా ఆల్మోస్ట్ రూ.100 కోట్లు బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.101 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఒక విధంగా ‘ఇరుముడి’ రిజల్ట్ ‘ప్యారడైజ్’ పై భారం అయ్యే అవకాశం లేకపోలేదు.