రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలో నటించారు. బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో మైనర్ బాలికతో చిత్రీకరణ నిర్వహించడంపై తెలంగాణ కార్మిక శాఖ స్పందించింది. ‘ఇరుముడి’ సినిమాలో మణమ్మగా నటించిన బేబీ నక్షత్ర మైనర్ కావడంతో నిబంధనల విషయంలో కార్మిక శాఖ కొన్ని ప్రశ్నలతో అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో నోటీసుల్లో అధికారులు ఏడు అంశాలపై నిర్మాతలను ప్రశ్నించారని సమాచారం. షూటింగ్‌కు ముందే జిల్లా మేజిస్ట్రేట్ నుండి అనుమతులు తీసుకున్నారా లేదా అని అడిగారు. అలాగే బాలిక తల్లిదండ్రుల నుండి అధికారిక సమ్మతి పత్రాలు పొందారా లేదా అని అడిగారు. అలాగే షూటింగ్ కాల్‌షీట్లు, హాజరు పట్టిక, రోజువారీ పని గంటల వివరాల గురించి కూడా చెప్పండి అని సినిమా టీమ్‌ను అడిగారట. బాలిక సంక్షేమం, భద్రత గురించి అడిగారని సమాచారం.
సినిమా చిత్రీకరణ సమయంలో చిన్నారి చదువుకు ఆటంకం లేకుండా తీసుకున్న చర్యల గురించి కూడా అడిగారు అని చెబుతున్నారు. సెట్‌లో మణమ్మ అలియాస్ నక్షత్ర భద్రత కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అని కూడా అడిగారట. అలాగే నిబంధనల ప్రకారం బాలిక పారితోషికంలో 20 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా లేదా అని కూడా ప్రశ్నించారట. సినిమా ప్రచారంలో నక్షత్రను భాగం చేయడం గురించి కూడా అడిగారని చెబుతున్నారు.
ఈ మొత్తం వివరాలతో నవంబర్ 4న తమ కార్యాలయంలో నేరుగా విచారణకు హాజరుకావాలని కార్మిక శాఖ అధికారులు ఆదేశించారట. మరి ఈ విషయమై సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఓ ఫోరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ ఈ చర్యలు తీసుకున్నట్లు భోగట్టా.