టాలీవుడ్‌లో ప్రస్తుతం సెలబ్రిటీల పెళ్లి వార్తలు తరచూ వినిపిస్తున్న క్రమంలో మరో యువ నటి గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటి కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
సినిమా వర్గాల సమాచారం ప్రకారం, కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక యువ సంగీత దర్శకుడితో సన్నిహితంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతుండగా, ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లి రూపంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇరు కుటుంబాలు కూడా సానుకూలంగా స్పందించాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇదిలా ఉండగా, ఆమె ప్రేమలో ఉన్నది, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు కాల భైరవ అనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కావ్య కళ్యాణ్ రామ్ లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, కావ్య కళ్యాణ్ రామ్ సినీ ప్రయాణం బాలనటిగా ప్రారంభమైంది. చిన్నప్పుడే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ముఖ్యంగా ‘గంగోత్రి’ సినిమాలో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న ఆమె ‘మసూద’ చిత్రంతో హీరోయిన్‌గా తిరిగి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించింది.
అనంతరం వచ్చిన ‘బలగం’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక టర్నింగ్ పాయింట్ అయింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని యువతీ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె పెళ్లి వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.