తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ట్రోలింగ్ మూడు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి నేరుగా మాటా మాటా అనుకోవడం. రెండోది సోషల్ మీడియాలో ముఖం చూపించకుండా ఏదేదో మాట్లాడుకోవడం. మూడోది స్టాండప్ కామెడీ అనే పేరుతో ఓ మనిషి నిలబడి తనకు నచ్చినట్లుగా మాట్లాడేయడం. దానికి దిగువ కూర్చున్నవాళ్లు చప్పట్లతో శభాష్ అనడం. ఈ మూడూ మీరు చూసుంటారు. అయితే ఇందులో స్టాండప్ కామెడీ కాస్త డిఫరెంట్ సినిమాల్ని, వ్యక్తిగత విషయాల్ని, రాజకీయ అవసరాల్ని కలపగలిపి ఒక వ్యక్తిని ఆడిపోసుకుంటూ ఉంటారు.
రెండుమూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో స్టాండప్ కామెడీ బాగా పెరిగింది. ప్రత్యేకమైన ప్రదేశాల్లో స్టాండప్ కామెడీ హబ్‌లు క్రియేట్ చేసి మరీ రోస్టింగ్ చేస్తున్నారు. రోస్టింగ్ అంటే ట్రోలింగ్‌కి మరో మెట్టు ఎక్కువన్నమాట. రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోల్ని కలగలిపి నోరు చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో అయితే కేసులు నమోదై కోర్టు మెట్లు ఎక్కి సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా మన దగ్గర అంత పరిస్థితి రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు స్టాండప్ కమెడిన్ అనుదీప్ కటికాల చేసిన కామెడీ స్టాండప్ కామెడీ ఎంత రిస్కో చెప్పకనే చెబుతోంది.
జనాలను నవ్వించడానికి కామెడీ చేయాలి కానీ.. కుటుంబాల జోలికి రాకూడదు అని అంటారు. ఆ విషయం మరచిపోయి కొంతమంది స్టాండప్ కమెడియన్లు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి నోరు చేసుకుంటున్నారు. అలా అనుదీప్ కటికాల.. ఇటీవల ఒక షోలో కొణిదెల నిహారిక విడాకుల గురించి, పవన్ కల్యాణ్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు. దీంతో ఆయన మీద మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుదీప్ స్టాండప్ కామెడీ షోలు నిర్వహించే చోటుకు వెళ్లి అనుదీప్ కోసం ఆరా తీశారు.
ఈ క్రమంలో అనుదీప్ ఓ స్పందన వీడియోను రిలీజ్ చేశాడు. నేను కావాలని అలా చేయలేదు అని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయినా మెగా ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారడం లేదు. గతంలో ఇలాంటి స్టాండప్ కమెడియన్లు సినిమా తారలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ట్రోల్/ రోస్ట్ చేశారు. అప్పుడు సమర్థించినవాళ్లు.. ఇప్పుడు సమర్థించడం లేదు. ఆ లెక్కన స్టాండప్ కామెడీ చేయడం, చేయించడం రెండూ రిస్కే. ఎందుకంటే అది రెండు వైపులా వాడి ఉన్న కత్తి. పట్టుకున్న చేతినే కోసేస్తుంది.