కొత్త సినిమాల్లో పాత హిట్ సాంగ్స్‌ని పెట్టడం మన దగ్గరే కాదు.. బాలీవుడ్‌లో కూడా ఎక్కువైపోయింది. అప్పటి ఫీలింగ్‌ని కలిగించడానికి దీనికి మించిన ఆప్షన్ మరొకటి లేదు అని సినిమా టీమ్ అనుకోవడమే కారణం అని చెప్పొచ్చు. అలాగే ఆ పాత పాట వైబ్‌ను సినిమాలోకి తీసుకొచ్చి.. కొత్త మజాను అందించే ప్రయత్నం కూడా ఉంది. ఈ క్రమంలో పాత పాట కంపోజ్ చేసినవారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు కూడా. అలా 40 ఏళ్ల నాటి ఓ పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు అందుకున్నారట. ప్రముఖ పాకిస్థాన్ పాప్ సింగర్ హసన్ జహంగీర్.
40 ఏళ్ల క్రితం అంటే 1986లో తాను రూపొందించిన ‘హవా హవా హే హవా’ పాటను ఓ సినిమాలో వాడుకొని తనకు 50 వేల డాలర్లు (సుమారు రూ.46 లక్షలు) ఇచ్చారని హసన్ జహంగీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఆ సినిమా పేరును చెప్పలేదు కానీ.. రూ.1000 కోట్లకుపైగా వసూలుచేసిన రీసెంట్ మూవీ అని చెప్పారు. ఆ సనిమా బృందం పాటను వాడుకునేందుకు తన అనుమతి తీసుకొని, అంత మొత్తం చెల్లించిందని చెప్పారు. ఆ పాట విషయంలో క్రెడిట్ ఇచ్చారని చెప్పారు.
జహంగీర్ చెప్పిన దాని ప్రకారం ఆ సినిమా ‘ధురంధర్’. అందులో ఎస్పీ చౌదరి అస్లామ్‌గా సంజయ్ దత్ ఎంట్రీ సీన్ సమయంలో బ్యాగ్రౌండ్‌లో ఈ పాట వినిపిస్తుంది. ఎడారిలో సంజయ్ దత్ విలన్లతో పోరాటం చేసే సమయంలోనూ ఈ ట్రాక్ వస్తుంది. దాని కోసమే అంత డబ్బులు ఇచ్చారన్నమాట. ఈ పాటను గతంలో కూడా బాలీవుడ్ సినిమాలో వాడారు. బాలీవుడ్ సినిమా ‘ఇన్సాఫ్ అప్నే లహూ సే’లోనూ ఈ పాట వాడారు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ సినిమా ప్రపంచ బాక్సాఫీసు దగ్గర రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2’ ఈ నెల 19న విడుదలవుతోంది.