కోలీవుడ్ సినిమా – రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అతి పెద్ద టాకింగ్ పాయింట్ విజయ్ విడాకులు. ఆయన టీవీకే పార్టీ పెట్టడానికి ముందు నుండే ఈ విషయంపై చర్చ జరుగుతున్నా.. ఆయన ఇలా పాలిటిక్స్ విషయంలో కాస్త సీరియస్ స్టెప్‌లు వేయగానే.. విడాకులు, బంధాల కాన్సెప్ట్‌ను బయటకు తీసుకొచ్చాయి రాజకీయ పార్టీలు. వారికి రాజేసిన అగ్గికి ఆజ్యం పోసినట్లు చాలా కాలంగా ఈ విషయంలో కామ్‌గానే ఉన్న విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుమెట్లెక్కారు.
ఇదంతా జరుగుతుండగా.. ఈ మొత్తం పరిస్థితికి కథానాయిక త్రిష కారణం అంటూ ఓ రూమర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఓ ఈవెంట్‌లో ఇద్దరు కలసి కనిపించడంతో రూమర్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొంతమంది కోలీవుడ్ జనాలు త్రిషకు సపోర్టుగా మాట్లాడారు. ఇప్పుడు సీనియర్ నటి ఖుష్బూ కూడా స్పందించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష చాలా హుందాగా ఉంటుందన్నారు. తెలియని వారు చేసే కామెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే.. ఎవరైనా తుమ్మితే వారినే నిందిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. నాకు విజయ్, త్రిష బాగా తెలుసు. త్రిష నాకు చాలా సన్నిహితురాలు కూడా. నాకు తెలిసిన గొప్ప మహిళల్లో ఆమె ఒకరు అని సపోర్టు చేసింది. అంతకుముందు కూడా ఖుష్బూ వీరిద్దరి గురించి మాట్లాడారు. ఈ వ్యవహారంతో ప్రజలకు ఏం సంబంధం ఉందో అర్థం కావడం లేదు. అది వారి వ్యక్తిగతం. దీనిని ఎందుకు పెద్ద విషయంలా చూస్తున్నారు? అని అడిగారు.
మరి ఈ కాంట్రవర్సీ విజయ్ పొలిటికల్ కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందా అని అడిగితే.. ‘‘ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు’’ అని చెప్పారామె. ఆమె ఎలా చెప్పినా వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ భవిష్యత్తుని తేల్చేది ఈ విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.