దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమాను తెలుగులో ‘జన నాయకుడు’ అనే పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది హాఫ్ రీమేక్. ఆ విషయం వదిలేస్తే.. ‘జన నాయగన్’ సినిమా విడుదల ఇంక చాలా లేట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కోర్టులో నడుస్తున్న కేసు విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.
సుప్రీం కోర్టు సూచనల ప్రకారం జనవరి 20న సినిమాకు సంబంధించిన కేసు విషయంలో తీర్పు వచ్చేస్తుంది అనుకున్నారంతా. కానీ న్యాయస్థానం వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. మద్రాసు హైకోర్టులో దాదాపు మూడు గంటలకు పైగా సుదీర్ఘ వాదనలు జరగ్గా, చీఫ్ జస్టిస్ మహీంద్ర మోహన్ శ్రీవాత్సవ, జస్టిస్ జి అరుళ్ మురుగన్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఉన్న ఓ ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది. అదే ఈ సినిమాపై ఎవరు ఫిర్యాదు చేశారు అనేది.
తుది నిర్ణయం తీసుకునే ముందు సినిమా విషయమై ఫిర్యాదు రావడంతో సమీక్ష కమిటీకి పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సెన్సార్ బోర్డు తరఫున న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదుపై ఎలాంటి సమాచారం తెలియజేయలేదని, సమీక్షకు పంపుతున్నట్లు మాత్రమే చెప్పారని నిర్మాణ సంస్థ తరఫున లాయర్ పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.శ్రీవాస్తవ సినిమాపై ఎవరి నుంచి ఫిర్యాదు వచ్చిందని ప్రశ్నించారు. ముంబయిలో ఉన్న సెన్సార్ బోర్డు ఛైర్మన్ నుండి అని సెన్సార్ బోర్డు తరఫున సమాధానమిచ్చారు.
దీంతో ఈ సినిమా విషయం ఫిర్యాదు ఇచ్చింది ఎవరు అనేది సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషికి మాత్రమే తెలుసు అని అర్థమవుతుంది. అయితే ఈ కేసు విషయంలో వాయిదా తేదీ చెప్పకుండా ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేయడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఈ సినిమా విడుదలవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.