టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ చర్చ ఓ కొలిక్కివచ్చింది. ఆదివారం నాడు ఈ వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. జానీ మాస్టర్, డాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలతతో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, దర్శకుల సంఘం నుండి సాయి రాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ ఈ చర్చలు జరిపారు. అనంతరం సమస్య ఓ కొలిక్కి వచ్చిందని మీడియాకు వివరించారు.
అనిల్ వల్లభనేని మాట్లాడుతూ… డాన్సర్స్ అసోసియేషన్‌లో ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయి. ఆ చర్చలకు ముగింపు పలికే దిశగా ఫెడరేషన్ నిర్ణయాలు తీసుకుంది. పెద్దల సమక్షంలో జానీ మాస్టర్, సుమలతతో చర్చించాం. జానీ మాస్టర్ ఫెడరేషన్ ఇచ్చిన వివరణపై ఫెడరేషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయన ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణను వెనక్కి తీసుకున్నాం. డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీలో రాజీనామాలు చేసిన వాళ్లందరూ కలసికట్టుగా ముందుకు వెళ్తారు అని చెప్పారు.
తప్పు చేసిన సెక్రటరీపై సభ్యుల సమక్షంలో చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు అని తెలిపారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్‌లకు ఫెడరేషన్ కావాలి, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వివరణ ఇచ్చి.. సమస్యను పరిష్కరించుకున్నాం అని చెప్పారు. సుమలత మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వివాదాలతో డ్యాన్సర్లు ఇబ్బందులు పడ్డారు. కార్మికుల శ్రమ దోపిడి జరగకూడదు అని అన్నారు.
నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు కావడం సాధారణ విషయం. నిర్మాతల సొమ్మును యూనియన్‌కు కట్టకుండా మాయం చేస్తున్న ఆ కొంతమందిని కార్మికులను గుర్తించి చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ… డాన్సర్స్ ఇరువర్గాలు మంచి వారే, ఎంతో కష్టపడి పని చేస్తారు. ఇక్కడ ఎవరి తప్పూ లేదు, ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అయ్యింది అన్నారు.
అసలేమైందంటే.. డ్యాన్సర్ల యూనియన్‌లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డు పడుతోందని జానీ మాస్టర్ ఆరోపించారు. సస్పెండ్ అయిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ ఒత్తిడి చేస్తోందన్నారు. దీనిపై నిర్మాతలకు కంప్లైంట్ కూడా చేశారు. దీంతో జానీ మాస్టర్‌పై బహిష్కరణ వేటు వేశారు. అయితే ఇప్పుడు సమస్య సమసిపోయింది.