ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయం అభిమానులతో పాటు సినీ ప్రముఖులకు కూడా షాకిచ్చింది. ఇప్పటికీ చైతు-సమంతలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా తన రెండో భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్నారు.
రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట విడాకులకు సిద్ధమవుతుందని సమాచారం. వారు మరెవరో కాదు.. జేడి చక్రవర్తి, అనుకృతి గోవింద్ శర్మ. రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన జేడి చక్రవర్తి ఆ తరువాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చాలా సినిమాలు చేశారు. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలున్నాయి.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించిన జేడి చక్రవర్తి 2016లో లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ ను వివాహం చేసుకున్నారు. అనుకృతి కూడా సినీ నేపథ్యం ఉన్న అమ్మాయే. జేడి చక్రవర్తి దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన ‘శ్రీదేవి’ సినిమాలో అనుకృతి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటైంది ఈ జంట.
కానీ ఇప్పుడు వారి వైవాహిక జీవితం సవ్యంగా సాగడం లేదని.. దీంతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి!