కాజల్.. టాలీవుడ్ చందమామ. సౌత్‌లో సినిమాలు చేసినా, తెలుగు సినిమాలోనే ఎక్కువగా గుర్తింపు సంపాదించింది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేసింది. కేవలం కమర్షియల్ హీరోయిన్ల సినిమాలూ చేసింది. అయితే ఆమె ఏం సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులు ఆదరించి.. ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా ఇచ్చేశారు. అయితే ఆమె తనయుడు నీల్‌కి మాత్రం తమిళ సినిమా చూపిస్తాను అంటోంది. ఆమె నటించిన సినిమానే అయినా.. స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు.
అయినా, ఈ రోజుల్లో తెలుగు సినిమా, తమిళ సినిమా ఏంటి? అన్నీ మన సినిమాలే కదా అనొచ్చు. కానీ ఆమె తన బిడ్డకు చూపిస్తాను అని చెప్పింది తమిళం నుండి తెలుగులోకి వచ్చిన సినిమా అని చెప్పడం మా ఉద్దేశం. కుమారుడు నీల్‌కి జన్మనిచ్చిన కాజల్… ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడిపింది. ఇటీవల తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తోంది. మరోవైపు ‘ఇండియన్ 2’ కూడా చేస్తోంది. ఈ క్రమంలో తన కుమారుడి గురించి కాజల్ ఆసక్తికర విషయాలు చెప్పింది.
కుమారుడు నీల్‌కి ఎనిమిదేళ్లు వచ్చేవరకు సినిమాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారట. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకుండా పెంచాలని అనుకుంటున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది. అలాగే నీల్ చూసే తొలి సినిమా విజయ్‌తో తాను నటించిన ‘తుపాకీ’ సినిమా అని చెప్పింఇ కాజల్. అయితే ఎందుకు ఆ సినిమా చూపించాలని అనుకుంటోంది అనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే దేశభక్తి నేపథ్యంలో రూపొందింది కాబట్టి ఆ సినిమా చూపించాలని అనుకుంటోందని సమాచారం.
మురుగదాస్ తెరకెక్కించిన సినిమా కాజల్ కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. సెలవు మీద సొంతూరుకు వచ్చిన ఓ సైనికుడు అనుకోని పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం బరిలోకి దిగుతాడు. ఎందుకు, ఏమిటి, ఎలా చేశాడు అనేది సినిమా కథ. ఇందులో కాజల్ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండకపోయినప్పటికీ.. కనిపించినంతసేపు ఎనర్జిటిక్‌గా ఉంటుంది.