అన్నదమ్ములు స్టార్ హీరోలు అయితే.. ఇద్దరూ విజయాలు సాధిస్తూ ఉంటే అభిమానులకు చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇద్దరూ కలసి స్టేజీ మీద మాట్లాడుతుంటే.. ఇంటర్వ్యూలో ఒకరి గురించి ఒకరు పాత విషయాలు చెబుతూ సరదాపడతారు.. అభిమానులను సరదా చేస్తారు కూడా. అలా ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఎంజాయ్ చేస్తున్న బ్రదర్స్ శివకుమార్ తనయులు. వారే సూర్య శివకుమార్, కార్తి శివకుమార్. రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో కార్తి గురించి సూర్య ఓ ఆసక్తికర విషయం చెప్పాడు..
సినిమాల్లోకి రావడానికి ముందు కార్తి అమెరికాలో ఉద్యోగం చేసేవాడు. సినిమాల్లో నటిద్దామని చెన్నైకి తిరిగి వచ్చినపుడు హీరో లుక్స్ లేకుండా, బాగా లావుగా ఉండేవాడు. అప్పట్లో చూసిన కొందరు ఇదేంటి హీరో అంటున్నారు.. ఇలా ఉన్నాడు అని అనుకున్నారు కూడా. దానికి కారణం ఆ టైమ్‌లో కార్తి బాగా ఫుడ్ తినేవాడు. జంక్‌ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకునేవాడట. యుఎస్‌లో ఉన్నప్పుడు కార్తి రైస్ బ్యాగ్ సైజు పొటాటో చిప్స్ ప్యాకెట్లు తినేవాడట. అలా చెన్నైకి వచ్చాక కూడా ఇంట్లో సోఫాలో కూర్చుని రైస్ బ్యాగ్ సైజులో చిప్స్ ప్యాకెట్ పెట్టుకుని తినేవాడు అని సూర్య చెప్పాడు.
అయితే, అలాంటివాడు ‘పరుత్తి వీరన్’ లాంటి ఓ సినిమా అవకాశం లభించగానే మొత్తం మారిపోయాడట. షాకింగ్ ట్రాన్స్‌ఫామ్‌తో ఆశ్చర్యపరిచాడట. ఆ తర్వాత ఒక్కో సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అని సూర్య అన్నాడు. నిజంగానే కార్తి ప్రతి సినిమాకు తనలో మార్పు చేసుకుంటూ వస్తున్నాడు. ఇటు శరీరం – లుక్ విషయంలో.. అటు కథల ఎంపిక విషయంలో కూడా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు.
బాక్సాఫీసు దగ్గర సరిగ్గా ప్రదర్శన ఇవ్వని కథల గురించి బహిరంగంగానే చెబుతూ.. ఎందుకు అలా జరిగింది అనేది చెబుతున్నారు. ఇటీవల ఓ స్టేజీ మీద మాట్లాడుతూ తన ‘జపాన్’ సినిమా గురించి ఇలానే మాట్లాడాడు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా.. దర్శకుడు రాజు మురుగన్‌తో కలసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు.