Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా
- September 28, 2026 / 12:13 PM ISTByFilmy Focus Desk
‘ఆర్‌ఆర్‌ఆర్ 2’ సినిమా ఆలోచన ఉందని మనకు ఎవరు చెప్పారు? ‘బాహుబలి 3’ సినిమా త్వరలో వస్తుంది అని మనకు ఎవరు చెప్పారు? ‘ఈగ 2’ సినిమా ఆలోచన చేస్తే బాగుంటుంది అని మనకు ఎవరు చెప్పారు? ఇలా ఈ సినిమాల విషయంలో పుకార్లు పుట్టించి, షికార్లు పెట్టించి తద్వారా ప్రచారంలో తరచూ నిలిచింది ఎవరు? ఇంకెవరు రాజమౌళి అండ్ కో. అంటే ఆయన టీమ్, ఆయన తీసిన సినిమాల టీమ్. కానీ ఇప్పుడు వారి టీమ్ నుండే మరో క్లారిటీ లెస్ క్లారిటీ వచ్చింది..
Karthikeya And Shobu
అదేంటి అనుకుంటున్నారా? నిర్మాతలు ఎస్ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ కలసి ఇటీవ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే సినిమా తీశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమాల సీక్వెల్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఈగ 2’, ‘ఆర్ఆర్ఆర్ 2’, ‘బాహుబలి 3’.. సినిమాల గురించి అడిగినప్పుడు.. నిజానికి ఈ మూడు సీక్వెల్స్‌కు ఐడియాలు ఉన్నాయి. ‘బాహుబలి 3’ సినిమాకు ఐడియాతో పాటు కాస్త ప్లాన్ చేశాం. కథ ఎలా టేకాఫ్ అవ్వాలి, ఎలా సాగాలి అన్న ఆలోచనలు ఉన్నాయి. కానీ రాజమౌళి టైమ్ సెట్ చేయాలి.. అది అంత సులభం కాదు అని కార్తికేయ చెప్పారు. ప్రస్తుతం అందరి దృష్టి ‘వారణాసి’ సినిమాపైనే ఉందని, ఆ సినిమా రిలీజ్ తర్వాత తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటామని చెప్పారు.
అయితే, ‘బాహుబలి’ ప్రపంచం నుండి ఏదో సినిమా వస్తూనే ఉంటుందని, ఆ కథ రాసుకున్న తొలి రోజుల్లో అందులో ప్రతి ప్రధాన పాత్రకు ఓ కథ అనుకున్నామని.. కాబట్టి ‘బాహుబలి’ ప్రపంచం కొనసాగుతుందని చెప్పారు శోభు యార్లగడ్డ. ఈ క్రమంలో ‘బాహుబలి: ఎటర్నల్ వార్’ అనే యానిమనేషన్ సినిమా తీస్తున్నామని.. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వస్తుందని చెప్పారాయన. అదన్నమాట సీక్వెల్స్ కథ.











