Vishal: మరోసారి గాయపడిన విశాల్.. గోవాలో ఆ సీన్ చేస్తూ..
- September 28, 2026 / 11:20 AM ISTByFilmy Focus Desk
సౌత్ సినిమాలో ఎక్కువగా రిస్కీ యాక్షన్ సీన్స్ చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. లేదు లేదు మా హీరో డూప్ లేకుండా రిస్కీ యాక్షన్ సీన్స్ చేస్తాడు అని మీరు వాదించొచ్చు కాక.. కానీ ఆ మాటలో నిజం ఎంత ఉందో ఆ హీరోలకు, వారి టీమ్‌కి తెలుసు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులెండి కానీ.. అలా రిస్కీ యాక్షన్ చేస్తూ తరచూ గాయపడే స్టార్ హీరో, ప్రముఖ తమిళ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డారు.
Vishal
గత కొన్ని ఏళ్లుగా విశాల్ తన సినిమాలో రిస్కీ యాక్షన్ సీన్స్ తనే డూప్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దాదాపు ప్రతి సినిమాలోనూ ఆ సీన్స్ అలానే చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు గాయపడినా, తీవ్ర అనారోగ్యం పాలైనా తిరిగి కోలుకొని మళ్లీ అదే నో డూప్ ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నారు. ఎంతమంది, ఎన్నిసార్లు జాగ్రత్త అని చెప్పినా ఆయన వినడం లేదు. దీనికి ఉదాహరణే తాజా గాయం.
విశాల్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. తమిళంలో ఈ సినిమాకు ‘పురుషన్’ అనే టైటిల్ పెట్టారు. తెలుగులో ఈ సినిమాకు ‘మొగుడు’ అనే పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని నెలలుగా శరవేగంగా సాగుతోంది. ఇటీవల గోవాలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో విశాల్‌కి వెన్నెముకకు గాయమైంది.
ఈ ఫైట్ షూటింగ్ వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అందులో గాల్లో ఎగిరి పడే సమయంలో విశాల్ గాయపడినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యం చేస్తున్నారు. కోలుకున్నాక తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడతాడు అని సమాచారం. ఇక ఈ కారణంగా నడిగర్ సంఘం జనరల్ బాడీ మీటింగ్‌కి విశాల్ హాజరుకాలేకపోయాడు. నడిగర్ సంఘం విషయంలో కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా కీలకం. కానీ విశాల్ గాయం కారణంగా హాజరు కావడం లేదు.












