బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? గత ఏడాది మిలియన్ డాలర్ ప్రశ్నఇది. ఏడాది కావస్తున్నా సమాధానం దొరకని పజిల్ ఇది. చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, చిత్ర బృందాన్ని ఎన్ని సార్లు అడిగినా బాహుబలి – ది కంక్లూజన్ సినిమాను చూడమని సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నపై సోషల్ మీడియాలో ఇప్పటికీ హాస్య ఫోటోలు, పోస్టులు విహారం చేస్తూనే ఉన్నాయి. బలమైన కారణం మాత్రం ఊహించలేక పోతున్నారు.
బాహుబలి – ది కంక్లూజన్ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ మొదలైన రోజు రాజమౌళి బాహుబలి చెయ్యి పైకి ఎత్తిన ఫోటోను విడుదల చేశారు. ఆ చెయ్యి మహేంద్ర బాహుబలి ది కాదు అమరేంద్ర బాహుబలిదేనని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. శివుడుకి అయితే మణికట్టు వద్ద ఆ రక్షక ఆభరణం ఉండదని, రాజులే వాటిని యుద్ధ సమయాల్లో ధరిస్తారని వివరించారు. బాహుబలి – ది బిగినింగ్ లో భల్లాళ దేవుడు దేవసేనతో “చచ్చేలోపు ఒక సారి చూడాలని నువ్వు.. మరోసారి కసితీరా చంపాలని నేను ఎదురుచూస్తూ ఉన్నాము” అని అంటాడు. ఈ డైలాగ్ తమ అంచనాను బలపరుస్తోందని వెల్లడించారు.
కొంతకాలం క్రితం బాహుబలి కథా రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ “బాహుబలి చనిపోయాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు” అని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. ఈ హింట్ లను చూస్తుంటే బాహుబలి ని కట్టప్ప చంపలేదనే ట్విస్ట్ రాజమౌళి ఇవ్వనున్నట్లు సినీ పండితులు భావిస్తున్నారు. శివుడు గా , బాహుబలి గా తెరమీద ప్రభాస్ కనిపిస్తే చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు సరిపోవు. బాహుబలి – ది కంక్లూజన్ వచ్చే ఏడాది వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.