నాని – శ్రీకాంత్ ఓదెల సినిమా ‘ది ప్యారడైజ్’ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను అనుకున్న సమయానికి రెడీ అవ్వదని ఆ వార్తల సారాంశం. ఈ విషయంలో చిత్రబృందం ఏమన్నా స్పందిస్తుందేమో అని నాని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం చిత్రబృందానికి హీరోయిన్ కయాదు లోహర్ పుట్టిన రోజు రూపంలో వచ్చింది. ఆమె బర్త్ డే సందర్భంగా ‘వెండితెరపై వెలగని తార’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెట్రో లుక్‌లో ఒకప్పటి హీరోయిన్‌లా లాంగ్ ఫ్రాక్‌తో కొత్తగా సారీ.. పాతగా కనిపించింది.
‘జడల్’ అంటూ నానిని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు జడల్ లవర్‌ను పరిచయం చేశారు. సుబ్బలక్ష్మి అనే అమ్మాయిగా ఈ సినిమాలో కయాదు లోహర్ కనిపించనుంది. ‘వెండితెరపై వెలగని తార’ అని పరిచయం చేశారు కాబట్టి.. సినిమా నాయిక అవ్వాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఆమె కనిపించబోతోంది అని చెప్పాచ్చు. అలాంటి అమ్మాయికి జడల్‌కి ఏం సంబంధం అనేది సినిమాలోనే చూడాలి. మామూలుగానే శ్రీకాంత్ ఓదెల తన హీరోయిన్ పవర్ ఫుల్‌గా చూపిస్తారని మనకు ఇప్పటికే తెలుసు.
‘దసరా’ సినిమాలో వెన్నెల పాత్ర చూపించిన ఎఫెక్ట్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్రతోనూ అలాంటి వైబ్ కచ్చితంగా చూస్తామని చెప్పొచ్చు. ఆ సంగతేంటో తేలాలి అంటే ఆగస్టు 21 వరకు ఆగాల్సిందే. గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా కయారు బర్త్ డే పోస్టర్‌లో రిలీజ్ డేట్ పెట్టారు. సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలలు ఉన్న నేపథ్యంలో పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా పరిస్థితి చూస్తున్నాం కదా. ‘ప్యారడైజ్’ కూడా ఇంతే.
అన్నట్లు ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ సినిమాలు రెండూ మార్చి ఆఖరి వారంలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు రెండు సినిమాలూ వాయిదా పడి కొత్త డేట్స్ అనౌన్స్ చేశారు. రెండో రిలీజ్ డేట్‌ని ‘పెద్ది’ సినిమా వాయిదా వేస్తోంది. కొత్త డేట్ ఇంకా చెప్పాల్సి ఉంది.